Virat Kohli 500 International Match: విరాట్ కోహ్లి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. టీమిండియా స్టార్ బ్యాటర్‌గా, సారథిగా అరుదైన రికార్డులెన్నో సాధించి కింగ్ కోహ్లిగా పేరొందాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే 75 సెంచరీలు సాధించి సమకాలీన క్రికెటర్లెవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.
రికార్డుల రారాజుగా ప్రసిద్ధికెక్కి GOAT(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనిపించుకుంటున్న కోహ్లి తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో(టెస్టు, వన్డే, టీ20.. మూడు ఫార్మాట్లలో కలిపి) 500వ మ్యాచ్ ఆడబోతున్నాడు. వెస్టిండీస్‌తో గురువారం(జూలై 20)న ఆరంభం కానున్న రెండో టెస్టుతో ఈ ఫీట్ నమోదు చేయనున్నాడు.
ఈ సందర్భంగా పరుగుల యంత్రం కోహ్లిపై ప్రశంపల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్.. విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విండీస్‌తో రెండో టెస్టు ఆరంభానికి ముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..
ఎంతటి కఠినశ్రమకైనా ఓరుస్తాడు
‘‘అతడంటే ఏమిటో.. కెరీర్ గణాంకాలు, రికార్డులే చెబుతున్నాయి. మ్యాచ్‌కు ముందు తను ఎంతగానో శ్రమిస్తాడు. ఎంతటి కఠిన శ్రమకైనా ఓరుస్తాడు. తనలో నాకు నచ్చిన గుణం అదే. ఆ అంకితభావమే 500వ మ్యాచ్ ఆడే దాకా తీసుకువచ్చింది.
కోహ్లి తన నోటితో ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఆటగాడైనా ఎప్పటికప్పుడు తనను తాను సమీక్షించుకుని, లోపాలుంటే సవరించుకుని.. ఫిట్‌నెస్ కాపాడుకుంటూ ముందుకు సాగితే యువ ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.
ఆ గుణాల వల్లే
విరాట్‌లో ఉన్న ఈ గుణాలే అతడు సుదీర్ఘకాలం పాటు ఆడేందుకు ఉపకరిస్తున్నాయి. క్రమశిక్షణ, పరిస్థితులకు తగ్గట్లు మసలుకునేతత్వం, కఠిన శ్రమ ఇవే కెరీర్‌ను పొడిగించుకునేందుకు సాయపడే అంశాలు. అవన్నీ కోహ్లిలో ఉన్నాయి గనుకనే ఇన్నేళ్లుగా తను ఆటలో కొనసాగుతున్నాడు’’ అని రాహుల్ ద్రవిడ్.. కోహ్లిని ఆకాశానికెత్తాడు.
తాను క్రికెట్ ఆడేటపుడు కోహ్లి యువకుడిగా జట్టులోకి వచ్చాడన్న ద్రవిడ్.. హెడ్‌కోచ్‌గా ఏడాదిన్నర కాలంలో అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపాడు. తన ప్రయాణంలో నేను కూడా ఒక భాగమైనందుకు సంతోషంగా ఉందన్నాడు.
ఫిట్‌నెస్ ఫ్రీక్
34 ఏళ్ల కోహ్లి ఫిట్‌నెస్ సమస్యల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు దాదాపుగా లేవనే చెప్పాలి. అలా క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన కోహ్లి తన కెరీర్‌లో టీమిండియా తరఫున ఇప్పటి వరకు 110 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టీమిండియా క్రికెటర్‌గా పదిహేనేళ్ల ప్రయాణంలో 25, 461 పరుగులు సాధించాడు. ఇందులో 75 శతకాలు, 131 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
500 & Counting 😃
— BCCI (@BCCI) July 20, 2023
Hear from #TeamIndia Head Coach Rahul Dravid and milestone man Virat Kohli ahead of a special occasion 👌🏻👌🏻#WIvIND | @imVkohli pic.twitter.com/cJBA7CVcOj
Comments
Please login to add a commentAdd a comment