చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన, ఆశా శోభన | IND-W Vs SA-W 1st ODI: Smriti Mandhana Scripts History Joins Mithali Raj | Sakshi
Sakshi News home page

Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన, ఆశా శోభన

Published Mon, Jun 17 2024 11:04 AM | Last Updated on Mon, Jun 17 2024 11:32 AM

IND-W Vs SA-W 1st ODI: Smriti Mandhana Scripts History Joins Mithali Raj

భారత క్రికెటర్‌ స్మతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. తద్వారా మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన భారత రెండో మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచింది.

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో స్మృతి ఈ ఘనత సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆకాశమే హద్దుగా చెలరేగిన మంధాన.. శతకంతో మెరిసింది. 127 బంతులు ఎదుర్కొని 117 పరుగులు సాధించింది. వన్డేల్లో ఆమెకిది ఆరో సెంచరీ.

ఈ క్రమంలో ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న మంధాన.. మిథాలీ రాజ్‌(10868 రన్స్‌) తర్వాత ఈ ఘనత సాధించిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. మంధాన తర్వాత ఈ లిస్టులో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(6870 రన్స్‌) ఉంది.

దక్షిణాఫ్రికాపై భారత్‌ ఘన విజయం
కాగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు శుభారంభం చేసిన విషయం తెలిసిందే. ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్‌ 143 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఓపెనర్, వైస్‌ కెపె్టన్‌ స్మృతి మంధాన (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపు సెంచరీతో చెలరేగింది.

వన్డేల్లో స్మృతికి ఇదో ఆరో శతకం కాగా... భారత గడ్డపై మొదటిది కావడం విశేషం. ఒకదశలో భారత్‌ 99/5తో కష్టాల్లో నిలిచింది. అయితే లోయర్‌ ఆర్డర్‌లో దీప్తి శర్మ (48 బంతుల్లో 37; 3 ఫోర్లు), పూజ వస్త్రకర్‌ (42 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు) స్మృతికి సహకరించారు.

5 వికెట్లు చేజార్చుకున్న తర్వాత కూడా భారత మహిళల బృందం 166 పరుగులు జోడించగలగడం తమ వన్డే చరిత్రలోనే అత్యధిక కావడం ప్రస్తావనాంశం. అనంతరం దక్షిణాఫ్రికా 37.4 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. 

సూన్‌ లూస్‌ (58 బంతుల్లో 33; 4 ఫోర్లు), సినాలో జఫ్తా (27 నాటౌట్‌), మరిజాన్‌ కాప్‌ (24) కొద్ది సేపు ప్రతిఘటించగలిగారు. కెరీర్‌లో తొలి వన్డే ఆడిన కేరళకు చెందిన లెగ్‌ స్పిన్నర్‌ ఆశా శోభన (4/21) ప్రత్యర్థిని పడగొట్టగా... దీప్తి శర్మకు 2 వికెట్లు దక్కాయి. 

ఆశా శోభన రికార్డు
అతి పెద్ద వయసులో (33 ఏళ్ల 92 రోజులు) భారత్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన ప్లేయర్‌గా ఆశా శోభన నిలిచింది. రెండో వన్డే 
బుధవారం ఇదే వేదికపై జరుగుతుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement