
విశాఖపట్నం: రెండో టెస్టులోనూ స్పిన్ పిచ్‌పై సమరానికి సిద్ధమని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. స్పిన్నర్ టామ్ హార్లీ మాయాజాలంతో హైదరాబాద్ టెస్టులో గెలిచిన ఉత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సిరీస్‌లో మరో పూర్తిస్థాయి స్పిన్ ట్రాక్ ఎదురైనా... తమ దళంలో అందుబాటులో ఉన్న నలుగురు స్పిన్నర్లతో దీటుగా ఎదుర్కొంటామని కోచ్ చెప్పారు. ‘ఒకవేళ తొలి టెస్టులాగే వైజాగ్‌లోని పిచ్ కూడా స్పిన్‌కే అనుకూలిస్తే భయపడం. జట్టులోని స్పిన్నర్లు దీన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.
షోయబ్ బషీర్ అబుదాబిలో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆడే సిరీస్‌లోనూ రాణించే నైపుణ్యం అతనికి ఉంది. తప్పకుండా ఇక్కడ కూడా అతను ప్రభావం చూపుతాడు’ అని మెకల్లమ్ అన్నాడు.
వైజాగ్ చేరుకున్న ఇరుజట్లు
భారత్, ఇంగ్లండ్ జట్లు మంగళవారం సాయంత్రం వైజాగ్ చేరుకున్నాయి. నేరుగా హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు అక్కడి నుంచి బస చేసే హోటల్‌కు వెళ్లిపోయారు. అనంతరం ఆటగాళ్లంతా ప్రయాణ బడలిక దృష్ట్యా పూర్తిగా హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో రెండో టెస్టు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment