ఒలింపిక్స్‌-2036 ఆతిథ్యానికి భారత్‌ సన్నద్ధం: ప్రధాని మోదీ | India Dream To Host Olympics 2036 We Are Preparing: PM Narendra Modi | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌-2036 ఆతిథ్యానికి భారత్‌ సన్నద్ధం: ప్రధాని మోదీ

Published Thu, Aug 15 2024 3:23 PM | Last Updated on Thu, Aug 15 2024 4:46 PM

India Dream To Host Olympics 2036 We Are Preparing: PM Narendra Modi

భారత్‌ వేదికగా విశ్వ క్రీడలు నిర్వహించాలన్న ఆశయానికి చేరువవుతున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒలింపిక్స్‌-2036కు ఆతిథ్యం ఇచ్చే దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో పాల్గొన్న భారత అథ్లెట్లకు ఆయన అభినందనలు తెలిపారు. అదే విధంగా.. ప్యారిస్‌ పారాలింపిక్స్‌లో పాల్గొనబోతున్న అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే విశ్వ క్రీడలు నిర్వహించాలన్న భారత్‌ కల సమీప భవిష్యత్తులో నెరవేరనుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

వారికి అభినందనలు
ఈ మేరకు.. ‘‘ఒలింపిక్స్‌లో భారత జెండాను ఎగురవేసిన యువ అథ్లెట్లు ఈరోజు మనతో ఉన్నారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున వారందరికీ అభినందనలు. మరికొన్ని రోజుల్లో భారత్‌ నుంచి మరో అతిపెద్ద బృందం ప్యారిస్‌కు వెళ్లబోతోంది. పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు భాగం కాబోతున్నారు. వారందరికీ నా శుభాకాంక్షలు.

జీ20 సమావేశం నిర్వహించేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. తద్వారా ప్రపంచస్థాయి ఈవెంట్లను మనం సమర్థవంతంగా పూర్తిచేయగలమని నిరూపించబోతున్నాం. అదే విధంగా.. ఒలింపిక్స్‌-2036కు ఆతిథ్యం ఇచ్చే దిశగా సన్నాహకాలు మొదలుపెట్టాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

ఆరు పతకాలకు పరిమితం
కాగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో పది పతకాలు లక్ష్యంగా బరిలోకి దిగిన భారత క్రీడా బృందం కేవలం ఆరింటికే పరిమితమైంది. షూటింగ్‌లో మనూ భాకర్‌కు వ్యక్తిగత కాంస్యంతో పాటు.. సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్‌ విభాగంలో మరో కాంస్య పతకం దక్కింది. 

అదే విధంగా.. త్రీ రైఫిల్‌ పొజిషన్స్‌లో స్వప్నిల్‌ కుసాలే కాంస్యం, భారత పురుషుల హాకీ జట్టుకు కాంస్యం, రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌కు కాంస్యం లభించాయి. ఇక టోక్యో గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో ఫైనల్లో రెండో స్థానానికి పరిమితమై రజతం సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఆగష్టు 28 నుంచి ప్యారిస్‌ వేదికగా పారాలింపిక్స్‌ మొదలుకానున్నాయి.​  ఇక ఒలింపిక్స్‌-2028కు అమెరికాలో జరుగనున్నాయి.

చదవండి: వినేశ్‌కు చుక్కెదురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement