భారత్‌లో ఇప్పటి వరకు జరిగిన ఏకైక ప్రపంచ స్థాయి మెగా స్పోర్ట్స్ ఈవెంట్ 2010 కామన్వెల్త్ గేమ్స్. దేశ రాజధాని వేదికగా జరిగిన ఈ పోటీలు ఆటల పరంగా విజయవంతంగా ముగియడంతో పాటు ఆర్థికపరంగా వివాదాలను కూడా వెంట తెచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మన దేశం మరో ప్రతిష్టాత్మక క్రీడా సంబరం కోసం ముందుకు వస్తోంది.
2036 ఒలింపిక్స్ నిర్వహించేందుకు తామూ సిద్ధంగా ఉన్నామని భారత్ ప్రకటించింది. దీనికి సంబంధించి తమ ఆసక్తిని కనబరుస్తూ అక్టోబర్ 1న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి చెందిన ఫ్యూచర్ హోస్ట్ కమిషన్‌కు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ‘లెటర్ ఆఫ్ ఇన్‌టెంట్’ను సమర్పించింది.
ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు
‘ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం వస్తే అది భారత ఆర్థిక వ్యవస్థకు, సామాజిక పురోగతికి, దేశవ్యాప్తంగా యువత స్వావలంబనకు ఎంతో మేలు చేస్తుంది’ అని ఐఓఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఏడాది క్రితం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో జరిగిన ఐఓసీ సెషన్‌లో భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించే అంశాన్ని మొదటిసారి ప్రస్తావించారు.
ఆయన సూచనల మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆధ్వర్యంలోని మిషన్ ఒలింపిక్ సెల్ అధికారులు సమగ్ర సమాచారంతో ప్రత్యేక నివేదికను రూపొందించారు.
ఒలింపిక్స్‌కు ఎలా బిడ్ వేయాలనే అంశం మొదలు అవకాశం దక్కించేందుకు సాగే ప్రక్రియకు సంబంధించి అన్ని వివరాలను ఇందులో పొందుపరిచారు. ఆ తర్వాతే ఐఓఏ దీనిపై ముందుకు వెళ్లింది. 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెలిస్ (అమెరికా)లో, 2032 బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)లో జరగనున్నాయి.
ప్రక్రియ ఇలా...
సాధారణంగా ఒలింపిక్స్ నిర్వహణపై ఆసక్తి మొదలు హక్కుల కేటాయింపు వరకు మూడు దశలు ఉంటాయి. ఎలాంటి ప్రక్రియలో అడుగుపెట్టకుండా వేర్వేరు వేదికలపై మేమూ నిర్వహిస్తాం అంటూ ప్రకటించే ‘ఇన్‌ఫార్మల్ డైలాగ్’ ఇందులో మొదటిది.
దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా కొంత ఆసక్తి మాత్రం ఏర్పడుతుంది తప్ప అధికారికంగా ఎలాంటి విషయమూ ఉండదు. అయితే ఇప్పుడు ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ ఇవ్వడంతో దానిని దాటి భారత్ ‘కంటిన్యూయస్ డైలాగ్’ దశకు చేరింది.
ఆసక్తి కనబర్చిన దేశాలు, అక్కడి రాజకీయ, ఇతర సామాజిక అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐఓసీ తెలుసుకుంటుంది. ఇందులో పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కుల అమలు లేదా ఉల్లంఘన వంటివి కూడా ఉంటాయి.
ఆయా దేశాలతో కూడా దీనిపై ఐఓసీ చర్చిస్తుంది. అయితే నిర్వహణపై ఎలాంటి హామీని ఇవ్వదు. మూడో దశలో ‘టార్గెటెడ్ డైలాగ్’ ఉంటుంది. ఇక్కడే అసలు నిర్వహణపై స్పష్టత వస్తుంది.
తుది నిర్ణయం ఆ కమిటీదే
ఆయా దేశాలు నిర్వహణపై తమ ప్రణాళికలు, మొత్తం బడ్జెట్ సహా ఇతర ఆర్థికపరమైన సమాచారం, తమకు అవకాశం ఇస్తే ఇతర దేశాలకంటే భిన్నంగా ఏం చేస్తామో అనే అన్ని అంశాలకు ఒక ఫార్మాట్‌లో వెల్లడించాల్సి ఉంటుంది. దీనిపై ఐఓసీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుంది. 2036 క్రీడల వేదికను 2025 తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.
అవకాశం వస్తే అహ్మదాబాద్‌లో!
ఒలింపిక్స్ నిర్వహణ కోసం ఆసక్తి చూపిస్తున్న దేశాలు బిడ్‌లో వేదికగా నగరాల పేర్లను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను దీని కోసం భారత్ ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.
అహ్మదాబాద్, గాంధీనగర్‌లలో కలిపి 22 రకాల క్రీడా వేదికలను అధికారులు గుర్తించారు. అయితే 2036 కోసం పోటీ పడుతున్న ఇతర నగరాలు, దేశాలతో పోలిస్తే మన దేశానికి అవకాశం రావడం అంత సులువు కాదనేది వాస్తవం.
నుసాన్‌తారా (ఇండోనేసియా), ఇస్తాంబుల్ (తుర్కియే), శాంటియాగో (చిలీ), న్యూ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ (ఈజిప్ట్), సియోల్ (దక్షిణ కొరియా), దోహా (ఖతర్), రియాద్ (సౌదీ అరేబియా), బుడాపెస్ట్ (హంగేరి), ట్యురిన్ (ఇటలీ), కోపెన్‌హాగెన్ (డెన్మార్క్), టొరంటో–మాంట్రియల్ (కెనడా) ఈసారి భారత్‌తో హక్కుల కోసం పోటీ పడుతున్నాయి.
వీటిలో సియోల్, మాంట్రియల్‌లకు గతంలోనే ఈ క్రీడలను నిర్వహించిన అనుభవం ఉండగా... సుసాన్‌తారా, ఇస్తాంబుల్, దోహా నగరాలు వరుసగా హక్కుల కోసం పోటీ పడుతూ త్రుటిలో అవకాశాలు చేజార్చుకున్నాయి.
అధికారిక బడ్జెట్ రూ. 98 వేల కోట్లు
ఈ నగరాల్లో అన్నింటిలో కూడా ఆర్థికపరంగా పరిపుష్టిగా ఉండటంతో పాటు 2022లో ‘ఫిఫా’ వరల్డ్ కప్ నిర్వహణతో ఇప్పటికే తమ స్థాయిని చూపించిన దోహా... 2034 ‘ఫిఫా’ వరల్డ్ కప్ హక్కులు దక్కించుకున్న రియాద్ ఒలింపిక్ రేసులో మిగతా నగరాలకంటే ముందున్నాయి.
వీటన్నింటిని దాటి భారత్ అవకాశం దక్కించుకుంటుందా అనేది ఆసక్తికరం. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ నిర్వహణ బడ్జెట్ అధికారికంగా 900 కోట్ల పౌండ్లు (సుమారు రూ.98 వేల కోట్లు) అంటే ఒలింపిక్స్ నిర్వహణ స్థాయి ఏమిటో ఊహించుకోవచ్చు!
చదవండి: ఆఫ్రో–ఆసియా కప్ పునరుద్ధరణ!
Comments
Please login to add a commentAdd a comment