ODI And T20 Rankings: Shubman Moves To 5th, Tilak Jumps To 46th Spot - Sakshi
Sakshi News home page

సత్తా చాటిన శుభ్‌మన్‌.. దుమ్మురేపిన తిలక్‌ వర్మ

Published Wed, Aug 9 2023 3:29 PM | Last Updated on Wed, Aug 9 2023 3:39 PM

India Players Rise In Latest ODI And T20 Rankings, Shubman To 5th, Tilak Jumps To 46th Spot - Sakshi

ఐసీసీ తాజాగా (ఆగస్ట్‌ 9) విడుదల చేసిన వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. విండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన యువ ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ కెరీర్‌ బెస్ట్‌ రేటింగ్‌ పాయింట్లు సాధించగా.. టీ20 సిరీస్‌లో ఇరగదీస్తున్న తిలక్‌ వర్మ ర్యాంకింగ్స్‌లో భారీ జంప్‌ కొట్టాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో 3 మ్యాచ్‌ల్లో ఓ హాఫ్‌సెంచరీ సాయంతో 126 పరుగులు చేసిన శుభ్‌మన్‌ 2 స్థానాలు మెరుగుపర్చుకుని ఐదో స్థానానికి ఎగబాకగా.. 3 మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీల సాయంతో 184 పరుగులు చేసిన ఇషాన్‌ కిషన్‌ 9 స్థానాలు మెరుగుపర్చుకుని 36వ ప్లేస్‌కు చేరుకున్నాడు.

టీ20ల విషయానికొస్తే.. విండీస్‌తో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో ఇరగదీసిన తిలక్‌ (39, 51, 49 నాటౌట్‌).. అరంగేట్రంలోనే 21 స్థానాలు మెరుగుపర్చుకుని 46వ స్థానానికి చేరాడు. టీ20 బౌలింగ్‌ విషయానికొస్తే.. విండీస్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న భారత లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ఏకంగా 36 స్థానాలు మెరుగుపర్చుకుని 51వ ప్లేస్‌కు చేరుకున్నాడు. కుల్దీప్‌ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఈ ఫార్మాట్‌లో కుల్దీప్‌ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ స్థానానికి ఎగబాకాడు.

టీ20 బౌలర్ల విభాగంలో భారత బౌలర్లు అక్షర్‌ 7 స్థానాలు, హార్ధిక్‌ పాండ్యా ఓ స్థానం మెరుగపర్చుకుని 33, 37 స్థానాల్లో నిలిచారు. విండీస్‌తో వన్డే సిరీస్‌లోనూ  రాణించిన హార్ధిక్‌.. బ్యాటింగ్‌లో 10 స్థానాలు, ఆల్‌రౌండర్ల విభాగంలో 5 స్థానాలు మెరుగుపర్చుకుని 71, 11 స్థానాల్లో నిలిచాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు (8) పడగొట్టిన శార్దూల్‌ ఠాకూర్‌ 4 స్థానాలు మెరుగుపర్చుకుని 30వ ప్లేస్‌కు చేరుకున్నాడు.   

పై పేర్కొన్న మార్పులు మినహా వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పులు జరగలేదు. వన్డే బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, ఫకర్‌ జమాన్‌ టాప్‌-3లో ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్‌ యాదవ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజమ్‌ టాప్‌-3లో ఉన్నారు.

బౌలింగ్‌ విషయానికొస్తే.. వన్డేల్లో హాజిల్‌వుడ్‌, స్టార్క్‌, రషీద్‌ ఖాన్‌ టాప్‌-3లో ఉండగా.. టీ20ల్లో రషీద్‌ ఖాన్‌, హాజిల్‌వుడ్‌, హసరంగ టాప్‌లో ఉన్నారు. వన్డేల్లో భారత ఆటగాళ్లలో శుభ్‌మన్‌ గిల్‌తో పాటు విరాట్‌ కోహ్లి (9) టాప్‌-10లో ఉండగా.. టీ20ల్లో సూర్యకుమార్‌ ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. బౌలింగ్‌ విభాగంలో వన్డేల్లో మహ్మద్‌ సిరాజ్‌ (4), కుల్దీప్‌ (10) టాప్‌-10లో ఉండగా.. టీ20ల్లో భారత్‌ నుంచి ఒక్కరు కూడా టాప్‌-10లో లేరు. టీ20ల్లో మెరుగైన ర్యాంకింగ్‌ కలిగిన భారత బౌలర్‌గా అర్షదీప్‌ (17) ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement