
ఎమర్జింగ్ ఆసియాకప్-2024లో భారత్-ఎ జట్టు ప్రయాణం ముగిసింది. అల్ఎమరత్ వేదికగా అఫ్గానిస్తాన్-ఎతో జరిగిన రెండో సెమీఫైనల్లో 20 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవిచూసింది. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు మాత్రమే చేయగల్గింది.
భారత బ్యాటర్లలో రమణ్‌దీప్ సింగ్(64) ఆఖరి వరకు పోరాడినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. రమణ్‌దీప్, బదోని(31) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. అఫ్గాన్ బౌలర్లలో ఘజన్‌ఫర్,రహమన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఓపెనర్లు జుబైద్ అక్బారిక్, సెదిఖుల్లా అటల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరూ భారత బౌలర్లను ఊచకోత కోశారు.
సెదిఖుల్లా(52 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83 పరుగులు) జుబైద్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 64 పరుగులు) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో రసిఖ్ దార్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. అకిబ్ ఖాన్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా ఆదివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంక, అఫ్గాన్ జట్లు తలపడనున్నాయి.