రెండో టి20: వ్యూహం మారేనా? | India vs England Second T20 Match Toady | Sakshi
Sakshi News home page

రెండో టి20: వ్యూహం మారేనా?

Published Sun, Mar 14 2021 4:12 AM | Last Updated on Sun, Mar 14 2021 8:57 AM

India vs England Second T20 Match Toady - Sakshi

తొలి టి20కి ముందు రోజు రోహిత్‌ శర్మ, రాహుల్‌ ఓపెనర్లని కెప్టెన్‌ ప్రకటన. కానీ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు రోహిత్‌కు విశ్రాంతి... టాప్‌–5లో నలుగురు బ్యాట్స్‌మెన్‌ దాదాపు ఒకే తరహా శైలి. తొలి బంతి నుంచి విరుచుకుపడకుండా టి20 అయినా సరే నిలదొక్కుకొని ఆ తర్వాతే పరుగులు చేసే రకం... జట్టులో ముగ్గురు స్పిన్నర్లు,  పవర్‌ప్లే స్పెషలిస్ట్‌గా గుర్తింపు ఉన్న వాషింగ్టన్‌ సుందర్‌కు 12వ ఓవర్లో కానీ బౌలింగ్‌ ఇవ్వకపోవడం... ఇవన్నీ గత మ్యాచ్‌లో భారత జట్టు ప్రణాళికలు... కొత్తగా ప్రయత్నిస్తున్నామని ఒక్క ఓటమితో ప్రపంచం మునిగిపోదు అని విరాట్‌ కోహ్లి చెప్పుకోవచ్చు కానీ మ్యాచ్‌ తుది ఫలితం మాత్రం నిరాశ కలిగించేదే. ఏ మార్పులు చేసినా, ఎలాంటి వ్యూహాలు పన్నినా టీమ్‌ గెలవడమే అన్నింటికంటే ప్రధానం. ఈ నేపథ్యంలో టీమిండియా ఎలాంటి కొత్త లెక్కలతో రెండో టి20లో బరిలోకి దిగుతుందనేది ఆసక్తికరం. 
 
అహ్మదాబాద్‌: వరల్డ్‌కప్‌ జట్టు కోసం అంచనాకు వచ్చేందుకు ఈ సిరీస్‌ ఉపయోగపడుతుందని చెబుతూ బరిలోకి దిగిన భారత్‌ తొలి టి20 పోరులో ఇంగ్లండ్‌ చేతిలో తలవంచింది. అయితే ఇప్పుడు ఆ పరాజయం నుంచి కోలుకొని తమ అసలు సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అటు ఇంగ్లండ్‌ కూడా తమ జోరును కొనసాగించి ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం రెండో టి20 మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.  

రోహిత్‌ శర్మ వస్తాడా...
‘రోహిత్‌లాంటి స్టార్‌ ఆటను చూసేందుకు జనం మైదానానికి వస్తారు. టీవీల్లో సిద్ధంగా ఉంటారు. అలాంటిది ఎలాంటి కారణం లేకుండా సరిగ్గా మ్యాచ్‌కు ముందు విశ్రాంతి అంటూ పక్కన కూర్చోపెట్టడంలో అర్థం లేదు’... మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన వ్యాఖ్య ఇది. గత మ్యాచ్‌ పరాజయ కోణంలోనైనా టీమ్‌ మేనేజ్‌మెంట్‌ రోహిత్‌ శర్మను ఆడిస్తుందా లేక ఈ మ్యాచ్‌లోనూ అదే జట్టును కొనసాగిస్తుందా చూడాలి. బౌలింగ్‌ విభాగంలో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగి ఫలితం రాబట్టడంలో విఫలమైన భారత్‌ ఒక మార్పు చేసే అవకాశం ఉంది. అక్షర్‌ పటేల్, వాషింగ్టన్‌ సుందర్‌లలో ఒకరిని తప్పించి ఫాస్ట్‌ బౌలర్‌ నవదీప్‌ సైనీకి అవకాశం కల్పించవచ్చు. ఇవి మినహా తుది జట్టులో మిగతా ఆటగాళ్లంతా కొనసాగడం ఖాయం. తొలి టి20లో మన టాప్‌–3 కలిసి చేసిన మొత్తం పరుగులు 5! ఈసారైనా జట్టుకు ఘనమైన ఆరంభం లభిస్తే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. టెస్టు సిరీస్‌లో రెండు డకౌట్లు నమోదు చేసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈ పోరును కూడా ‘సున్నా’తోనే మొదలు పెట్టాడు. పూర్తిగా ఫామ్‌ కోల్పోకపోయినా... తన స్థాయికి తగిన ప్రదర్శన అతని నుంచి రావడం లేదనేది మాత్రం వాస్తవం. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ మరోసారి కీలకం కానున్నాడు. టీమ్‌లో ఇద్దరు దూకుడైన ఆటగాళ్లు రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్యా మెరుపు ప్రదర్శన కనబరిస్తే జట్టుకు తిరుగుండదు. పునరాగమనంలో భువనేశ్వర్‌ కుమార్‌ బాగానే బౌలింగ్‌ చేయగా, శార్దుల్‌ ఠాకూర్‌ ఫర్వాలేదనిపించాడు.  కొత్త ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్, ఇషాన్‌ కిషన్‌లకు ఈ మ్యాచ్‌లోనూ అవకాశం దక్కకపోవచ్చు.  

మరో స్పిన్నర్‌కు చోటు

ఇయాన్‌ మోర్గాన్, బెన్‌ స్టోక్స్‌లాంటి హిట్టర్లు బరిలోకి దిగాల్సిన అవసరం రాకుండానే తొలి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌ ముగించగలిగింది. వారి తుది జట్టును చూస్తే ఒక్క ఆదిల్‌ రషీద్‌ మినహా పదో నంబర్‌ వరకు బ్యాటింగ్‌ చేయగలరు. ఈ మ్యాచ్‌లోనూ దాదాపు అదే టీమ్‌కు అవకాశం ఉంది. అయితే పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా కనిపిస్తే స్యామ్‌ కరన్‌కు బదులుగా ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీకి అవకాశం ఇవ్వాలని ఇంగ్లండ్‌ యోచిస్తోంది. ప్రధాన స్పిన్నర్‌ రషీద్‌ కూడా గత మ్యాచ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు. ధాటిగా ఆడగల ఓపెనర్లు జేసన్‌ రాయ్, జోస్‌ బట్లర్‌ ఆ జట్టుకు పెద్ద బలం. వరల్డ్‌ నంబర్‌వన్‌ మలాన్‌ కూడా చెలరేగగా, టెస్టుల్లో విఫలమైన బెయిర్‌స్టో కూడా ఆకట్టుకున్నాడు. ఇక మోర్గాన్‌ ఆకాశమే హద్దుగా సిక్సర్లతో చెలరేగిపోగలడు. బౌలింగ్‌లో విఫలమైనా... జట్టులో స్టోక్స్‌ విలువ అమూల్యం. అన్నింటికి మించి తొలి మ్యాచ్‌లో భారత్‌ను ఎక్స్‌ప్రెస్‌ వేగంతో దెబ్బ తీసిన జోఫ్రా ఆర్చర్, మార్క్‌ వుడ్‌ మరోసారి మన బ్యాట్స్‌మెన్‌ పని పట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరు పిచ్‌ను బ్రహ్మాండంగా వాడుకున్నారు. మరోసారి ఇరు వైపుల నుంచి దాదాపు 150 కిలో మీటర్ల వేగంతో వీరు బౌలింగ్‌ చేస్తే భారత్‌కు అంత సులువు కాదు.

తుది జట్టు వివరాలు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్‌/రోహిత్‌ శర్మ, రాహుల్, పంత్, అయ్యర్, పాండ్యా, శార్దుల్, సుందర్‌/సైనీ, అక్షర్, భువనేశ్వర్, చహల్‌.
ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, బట్లర్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, కరన్‌/అలీ, ఆర్చర్, జోర్డాన్, రషీద్, వుడ్‌.

పిచ్, వాతావరణం
మొటెరాలో 11 పిచ్‌లు అందుబాటులో ఉన్నాయి. గత మ్యాచ్‌ అనుభవాన్ని బట్టి చూస్తే పేస్, బౌన్స్‌ కాస్త తక్కువగా ఉండి స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ ఎంపిక చేసుకునే అవకాశం కనిపిస్తోంది. బ్యాట్స్‌మెన్‌ నిలబడితే పరుగులు రావడం కష్టం కాదు. వర్ష సూచన లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement