India Vs Sri Lanka 2021 1st ODI Live Updates And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

Ind vs SL: తొలి వన్డేలో భారత్‌ ఘనవిజయం

Published Sun, Jul 18 2021 2:53 PM | Last Updated on Sun, Jul 18 2021 10:33 PM

India vs Srilanka:First Odi Updates, Match Highlights - Sakshi

కొలంబో: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఘనవిజయాన్ని సాధించింది. ఏడు వికెట్ల తేడాతో భారత్‌ శ్రీలంకపై గెలిచింది. భారత బ్యాటింగ్‌లో శిఖర్‌ ధవన్‌, ఇషాన్‌ కిషాన్‌, పృధ్వి షా రాణించారు. చివర్లో సూర్య కూమార్‌ యాదవ్‌ మెరుపు బ్యాటింగ్‌తో భారత్‌ విజయతీరాలకు చేరుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్‌ నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటింగ్‌లో కరుణరత్నే 43 నాటౌట్‌, శనక (39), అసలంక(38) పరుగులు చేశారు. భారత్ బౌలింగ్‌లో కుల్దీప్‌, చాహల్‌, చాహర్‌కు చెరో రెండు వికెట్లు, హార్దిక్‌, కృణాల్‌కు తలో వికెట్లను  పడగొట్టారు.

బ్యాటింగ్‌లోకి దిగిన టీమిండియా లక్ష్యాన్ని 13 ఓవర్లు మిగిలి ఉండగానే విజయవంతంగా చేధించింది. భారత బ్యాటింగ్‌లో శిఖర్‌ ధవన్‌ 86*, ఇషాన్ కిషన్ 59, పృథ్వీ షా 43, సూర్య కుమార్‌ యాదవ్‌ 31* పరుగులను రాబట్టారు. తొలి వన్డేలో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా పృథ్వీ షా నిలిచాడు.      

గబ్బర్‌ బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ ఆడుతున్న ధవన్‌(61 బంతుల్లో 50; 3 ఫోర్లు) ఎంతో సంయమనమై ఆటతీరుతో బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీ సాధించాడు. అరంభం నుంచి ఆచితూచి ఆడిన గబ్బర్‌ క్రమంగా గేర్‌ మారుస్తూ వచ్చాడు. ఈ క్రమంలో వన్డేల్లో 33 హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. కాగా, ఇదే మ్యాచ్‌లో ధవన్‌ పలు రికార్డులను నెలకొల్పాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో(140) 6000 పరుగులు పూర్తి చేసిన 4వ బ్యాట్స్‌మెన్‌గా, అలాగే శ్రీలంకపై అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. కాగా, 24.1 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 175/2. క్రీజ్‌లో ధవన్‌కు తోడుగా మనీశ్‌ పాండే(9) ఉన్నాడు.

రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా, ఇషాన్‌ కిషన్‌(59) ఔట్‌
శతకొట్టేలా కనిపించిన ఇషాన్‌ కిషన్‌ (42 బంతుల్లో 59; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సందకన్‌ బౌలింగ్‌లో భానుకకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 17.5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 142/2. క్రీజ్‌లో ధవన్‌(41 బంతుల్లో 28; ఫోర్‌), మనీశ్‌ పాండే(0) ఉన్నారు. 

అరంగేట్రంలోనే అదరగొట్టాడు, ఇషాన్‌ కిషన్‌ స్టన్నింగ్‌ ఫిఫ్టి
వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌(34 బంతుల్లో 53; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అరంగేట్రంలోనే అర్ధశతకంతో అదరగొట్టాడు. వన్డే కెరీర్‌ను సిక్స్‌, బౌండరీతో ప్రారంభించిన ఈ బీహార్‌ కుర్రాడు.. 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో ఇషాన్‌ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20, వన్డే.. రెండు ఫార్మాట్లలోనూ అరంగేట్రంలోనే హాఫ్‌ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. అలాగే అరంగేట్రం వన్డేలో అతి తక్కువ బంతుల్లో(33) ఫిఫ్టి సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో కృనాల్‌ పాండ్యా తన అరంగేట్రం మ్యాచ్‌లో కేవలం 26 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించాడు. కాగా, ఇషాన్‌ ధాటికి 15 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 127/1గా ఉంది. క్రీజ్‌లో అతనితో పాటు ధవన్‌(32 బంతుల్లో 19; ఫోర్‌) ఉన్నాడు.  

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. పృథ్వీ షా(43) ఔట్‌
ధాటిగా ఆడుతున్న ఓపెనర్‌ పృథ్వీ షా(24 బంతుల్లో 43; 9 ఫోర్లు) అనవసరపు షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ పారేసుకున్నాడు. స్పిన్నర్‌ ధనుంజయ డిసిల్వా వేసిన ఫ్లయిటెడ్‌ డెలివరీని భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో షా పెవిలియన్‌కు చేరాడు. మిడ్‌ వికెట్‌లో ఉన్న అవిష్క ఫెర్నాండో క్యాచ్‌ అందుకున్నాడు. 5.3 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 58/1. క్రీజ్‌లో ధవన్‌(9 బంతుల్లో 8; ఫోర్‌), ఇషాన్‌ కిషన్‌(0) ఉన్నారు. 

షా 'షో'.. 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 57/0
టీమిండియా ఓపెనర్‌ పృథ్వీ షా(23 బంతుల్లో 43; 9 ఫోర్లు) వరుసపెట్టి బౌండరీలు బాదుతూ.. లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అతని ధాటికి టీమిండియా 5 ఓవర్లకే 50 పరుగుల మార్క్‌ను దాటింది. మరోవైపు కెప్టెన్‌ ధవన్‌(7).. సూపర్‌ టచ్‌లో ఉన్న షాకే ఎక్కువ స్ట్రయిక్‌ ఇస్తూ సపోర్టింగ్‌గా నిలిచాడు. వీరిద్దరి ధాటికి 5 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 57/0గా ఉంది. 

లంక స్కోర్‌ 262/9.. టీమిండియా టెర్గెట్‌ 263
భువనేశ్వర్ కుమార్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో కరుణరత్నే(35 బంతుల్లో 43 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు) రెచ్చిపోయాడు. వరుసగా ఫోర్‌, రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఈ ఓవర్‌లో మొత్తం 19 పరుగులు పిండుకున్నాడు. ఇనింగ్స్‌ ఆఖరి బంతికి పరుగు తీసే ప్రయత్నంలో చమీరా(7 బంతుల్లో 13; ఫోర్‌, సిక్స్‌) రనౌట్‌ కావడంతో లంక ఇన్నింగ్స్‌ 262 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో చహల్‌, కుల్దీప్‌, చాహర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా కృనాల్‌ పాండ్యా, హార్ధిక్‌లకు చెరో వికెట్‌ దక్కింది. లంక జట్టు టీమిండియా ముందు 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.  

లంక ఎనిమిదో వికెట్‌ డౌన్‌.. ఉడాన(8) ఔట్‌
హార్ధిక్‌ సంధించిన స్లో డెలివరీని తప్పుగా అంచనా వేసిన ఉడాన(9 బంతుల్లో 8), భారీ షాట్‌కు ప్రయత్నించే క్రమంలో చాహర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లంక ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. 46.5 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 223/8గా ఉంది.క్రీజ్‌లో కరుణరత్నే(17), చమీరా(0) ఉన్నారు.

ఏడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక.. శనక(39) ఔట్‌ 
తన ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో చహల్‌ లంక కెప్టెన్‌ శనకను(50 బంతుల్లో 39; 2 ఫోర్లు, సిక్స్‌) బోల్తా కొట్టించాడు. చహల్‌ వేసిన టెంప్టింగ్‌ బంతిని భారీ షాట్‌కు తరలించే క్రమంలో శనక పెవిలియన్‌ బాట పట్టాడు. లాంగాన్‌లో హార్ధిక్‌ సునాయాసమైన క్యాచ్‌ అందుకోవడంతో అతను వెనుదిరిగాడు. దీంతో 43.5 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 205/7గా ఉంది.క్రీజ్‌లో కరుణరత్నే(9), ఉడాన(0) ఉన్నారు. భారత బౌలర్లలో చహల్‌, కుల్దీప్‌, చాహర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా కృనాల్‌ పాండ్యాకు ఓ వికెట్‌ దక్కింది. 

గబ్బర్‌ సూపర్‌ క్యాచ్‌.. హసరంగా(8) ఔట్‌
కెప్టెన్‌ గబ్బర్‌ అద్భుతమైన లో క్యాచ్‌ అందుకోవడంతో హసరంగా పెవిలియన్‌కు చేరాడు. చాహర్‌ బౌలింగ్‌లో పుల్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో హసరంగా డీప్‌ మిడ్‌ వికెట్‌లో ఉన్న ధవన్‌కు క్యాచ్‌ అందించి ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. 39.3 ఓవర్ల తర్వాత లంక స్కోర్‌ 186/6గా ఉంది.క్రీజ్‌లో శనక(29), కరుణరత్నే(0) ఉన్నారు. 

దీపక్‌ చాహర్‌ స్లో డెలివరీకి దొరికేశాడు..
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక 38 ఓవర్‌లో ఐదో వికెట్‌ను కోల్పోయింది. దీపక్‌ చాహర్‌ వేసిన ఆ ఓవర్‌ రెండో బంతికి చరిత్‌ అసాలంకా(38) ఔటయ్యాడు. దీపక్‌ చాహర్‌ వేసిన స్లో డెలివరీకి కీపర్‌ ఇషాన​ కిషాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు అసాలంకా. దాంతో శ్రీలంక 166 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. 39 ఓవర్లు ముగిసే  సరికి శ్రీలంక ఐదు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.  

నాల్గో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.  32 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌లో నిలకడలేమి కనిపిస్తోంది. లంకేయులు 117 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయారు.  ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌ నాల్గో బంతికి  ధనంజయ డిసిల్వా(14) ఔటయ్యాడు. కృనాల్‌ పాండ్యా వేసిన ఆ ఓవర్‌లో భువనేశ్వర్‌ లాంగాఫ్‌లో క్యాచ్‌ పట్టడంతో డిసిల్వా పెవిలియన్‌ చేరాడు. 

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు.. శ్రీలంక 89/3
 శ్రీలంక రెండో వికెట్‌ను కోల్పోయింది. ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడు భానుక రాజపక్సా(24) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.  ఇన్నింగ్స్‌ 17 ఓవర్‌ తొలి బంతికి రాజపక్సా పెవిలియన్‌కు చేరాడు.  కుల్డీప్‌ వేసిన ఓవర్‌లో మిడాన్‌లో ధవన్‌ క్యాచ్‌ పట్టడంతో భానుకా రాజపక్సా ఔటయ్యాడు. అనంతరం ఓపెనర్‌ మినోద్‌ భానుకా(27) కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. కుల్దీప్‌ వేసిన అదే ఓవర​ నాల్గో బంతికి మినోద్‌ స్లిప్‌లో పృథ్వీ షాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో లంకేయులు 89 పరుగులు వద్ద మూడో వికెట్‌ను నష్టపోయారు. 

వచ్చీ రావడంతో వికెట్‌.. 10వ ఓవర్‌లో తొలి వికెట్‌
టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ గెలిచిన శ్రీలంక నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. ఆ జట్టు 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ మాత్రమే నష్టపోయింది.  యజ్వేంద్ర చహల్‌ వేసిన 10వ ఓవర్‌ తొలి బంతికి అవిష్కా ఫెర్నాండో(32) ఔటయ్యాడు.  కవర్స్‌ మీదుగా షాట్‌ ఆడబోయిన ఫెర్నాండో.. మనీష్‌ పాండేకు నేరుగా క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అది చహల్‌ తొలి ఓవర్‌ కాగా, వేసిన తొలి బంతికే వికెట్‌ తీయడం ఇక్కడ విశేషం. 10 ఓవర్లు ముగిసేసరికి లంక వికెట్‌ నష్టానికి 55 పరుగులు చేసింది. భానుకా రాజపక్సా, మినోద్‌ భానుకాలు క్రీజ్‌లో ఉన్నారు.  

కొలంబో: టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ షనకా ముందుగా బ్యాటింగ్‌కు  మొగ్గుచూపాడు. పేరుకు ద్వితీయ శ్రేణి జట్టుగా చెబుతున్నా, టీమిండియాలో దాదాపు అందరికీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉండగా... అటు శ్రీలంక మాత్రం కోవిడ్, కాంట్రాక్ట్‌ వివాదాలు, సీనియర్ల గైర్హాజరువంటి సమస్యలతో సతమతమవుతూ సిరీస్‌కు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో అన్ని రకాలుగా భారత జట్టు ఫేవరెట్‌గా కనిపిస్తుండగా, అభిమానుల కోణంలో చూస్తే మాత్రం ఈ సిరీస్‌పై ఆసక్తి కాస్త తక్కువగా ఉంది. కాగా, ఈ మ్యాచ్‌ ద్వారా ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార​ యాదవ్‌లు వన్డే అరంగేట్రం చేశారు. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన వీరిద్దరూ తాజాగా వన్డేల్లో అరంగేట్రం చేశారు.  

టీమిండియా తుదిజట్టు: శిఖర్‌ ధవన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌, మనీష్‌ పాండే, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, యజ్వేంద్ర చహల్‌,
కుల్దీప్‌ యాదవ్‌

శ్రీలంక తుదిజట్టు: షనకా(కెప్టెన్‌), అవిష్కా ఫెర్నాండో, భానుక రాజపక్సా, మినోద్‌ భానుకా, దనంజయ డిసిల్వా, చరిత్‌ ఆసాలంకా, వినిందు హసరంగా, చమికా కరుణరత్నే, ఇసుర ఉదానా, దుస్మంతా
చమీరా,  లక్షణ్‌ షన్‌దాకన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement