సొకా (జపాన్): తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి ఇన్నాళ్లూ ఇంటాబయటా డబుల్స్ టైటిల్స్‌తో పతాక శీర్షికల్లో నిలిచాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ బ్యాడ్మింటన్ స్టార్ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు’ల్లోకెక్కాడు. చిరాగ్ శెట్టితో కలిసి అతను ఇటీవల ఇండోనేసియా ఓపెన్‌లో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచాడు. మేటి డబుల్స్ షట్లర్‌గా రాటుదేలిన సాత్విక్‌కు టైటిళ్లు కొత్తేం కాదు.
అయితే తాజాగా బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యంత వేగవంతమైన స్మాష్‌తో సాత్విక్ రికార్డు సృష్టించాడు. జపాన్‌కు చెందిన ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ యోనెక్స్ తమ ఫ్యాక్టరీలో ఇటీవల నిర్వహించిన టెస్టులో సాత్విక్ రాకెట్ వేగంతో స్మాష్ కొట్టాడు. సాత్విక్ స్మాష్‌కు షటిల్ గంటకు 565 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.
ఫార్ములావన్ సర్క్యూట్‌లో రయ్ రయ్‌మని రాకెట్ వేగంతో దూసుకెళ్లే కారు వేగం (గంటకు 372.6 కి.మీ.) కంటే కూడా సాత్విక్ స్మాష్ వేగమే ఎక్కువ! బ్యాడ్మింటన్‌లో ఇది అసాధారణ వేగం. దీంతో దశాబ్దం క్రిందట మలేసియన్ షట్లర్ తన్ బూన్ హియాంగ్ (2013లో) గంటకు 493 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డును సాత్విక్ బద్దలుకొట్టాడు.
తద్వారా ‘ఫాస్టెస్ట్ స్మాష్’ రికార్డును సాత్విక్ సాయిరాజ్ తన పేరిట గిన్నిస్ బుక్‌లో లిఖించుకున్నాడు. మహిళల విభాగంలో మలేసియా షట్లర్ తన్ పియర్లీ గంటకు 438 కి.మీ. వేగంతో కొట్టిన స్మాష్ రికార్డు కూడా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది.
ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం
ప్రస్తుతం కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో ఆడుతున్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–16, 21–14తో సుపక్ జోమ్కో–కిటినిపోంగ్ కెద్రెన్ (థాయ్‌లాండ్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత్‌కే చెందిన ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల జోడీ తొలి రౌండ్‌లోనే ని్రష్కమించింది.
Comments
Please login to add a commentAdd a comment