క్వార్టర్ ఫైనల్లోనే ఓడిన భారత పురుషుల ఆర్చరీ జట్టు
పారిస్: సీజన్‌లో రెగ్యులర్‌గా జరిగే ప్రపంచకప్ టోర్నీలలో పతకాలు సాధించే భారత ఆర్చర్లు ఒలింపిక్స్ క్రీడల్లో మాత్రం తమ వైఫల్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం భారత మహిళల రికర్వ్ జట్టు నిరాశాజనక ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరగ్గా... భారత పురుషుల రికర్వ్ జట్టు కూడా అదే బాటలో పయనించింది. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్ (సిక్కిం), ప్రవీణ్ జాధవ్ (మహారాష్ట్ర)లతో కూడిన భారత బృందం లక్ష్యం దిశగా గురి తప్పి క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది.
ర్యాంకింగ్ రౌండ్‌లో అద్భుత ఆటతీరుతో మూడో స్థానంలో నిలిచి తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా క్వార్టర్ ఫైనల్ ఆడిన భారత జట్టు ఈ అడ్డంకిని దాటలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 2–6తో మెటె గజోజ్, బెర్కిమ్ తుమెర్, అబ్దుల్లాలతో కూడిన టర్కీ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి సెట్‌ను 57–53తో, రెండో సెట్‌ను 55–52తో నెగ్గిన టర్కీ 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
మూడో సెట్‌లో భారత జట్టు 55–54తో గెలిచి ఆధిక్యాన్ని 2–4కి తగ్గించింది. చివరిదైన నాలుగో సెట్‌లో టర్కీ బృందం 58–54తో నెగ్గి విజయాన్ని అందుకోవడంతోపాటు సెమీఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో టర్కీ 4–5తో ఫ్రాన్స్ చేతిలో ఓడిపోయింది. అనంతరం కాంస్య పతక పోరులో టర్కీ 6–2తో చైనాపై గెలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియా 5–1తో ఫ్రాన్స్‌పై గెలిచి ఏడోసారి టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment