IPL 2022: RCB Won Match With Green Jersey, Fans Says It Is Signals RCB Team To Enter Finals - Sakshi
Sakshi News home page

IPL 2022: ఆర్సీబీ ఫైనల్స్‌కు చేరడం పక్కా.. ఆధారాలివిగో అంటున్న ఫ్యాన్స్‌..!

Published Mon, May 9 2022 12:26 PM | Last Updated on Mon, May 9 2022 1:15 PM

IPL 2022: RCB Won Match In Green Jersey Signals Bengaluru Team Entering Finals - Sakshi

Photo Courtesy: IPL

పర్యావరణ పరిరక్షణ, పచ్చదనంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ప్రతి యేటా ‘గో గ్రీన్’ నినాదంతో ఓ మ్యాచ్‌కు గ్రీన్ క‌ల‌ర్ జెర్సీల‌తో బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రంగు జెర్సీలు తమ ఆటగాళ్లకు అచ్చి రావట్లేదన్న సెంటిమెంట్‌ను ఆ జట్టు అభిమానులు బలంగా నమ్ముతారు. ఈ సీజన్‌కు ముందు వరకు ఆర్సీబీ గ్రీన్‌ జెర్సీల్లో ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడింటిలో (2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020) ఓట‌మిపాల‌వ్వ‌గా.. రెండు మ్యాచ్‌ల్లో (2011, 2016) విజ‌యాలు, మ‌రో మ్యాచ్ (2015) వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. 

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ కలర్ జెర్సీల్లో  బరిలో దిగిన ఆర్సీబీ.. ఆరెంజ్‌ ఆర్మీని 67 పరుగుల తేడాతో చిత్తు చేసి సీజన్‌లో ఏడో విజయంతో ప్లే ఆఫ్స్‌ దిశగా దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ అవకాశాలపై ఆ జట్టు అభిమానులు ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గతంలో తమ జట్టు గ్రీన్ కలర్ జెర్సీల్లో గెలిచిన సీజన్లలో ఫైనల్స్‌కు చేరిందని, దీంతో ఈ సీజన్‌లోనూ డుప్లెసిస్‌ సేన పక్కాగా ఫైనల్స్‌కు చేరుతుందని బల్ల గుద్ది చెబుతున్నారు. అంతే కాకుండా ఈ ఏడాది తమ జట్టు పాత ఆనవాయితీకి కూడా చరమగీతం పాడి టైటిల్‌ను ఎగురేసుకుపోతుందని ధీమాగా ఉన్నారు. 

కాగా, ఆర్సీబీ తొలిసారి గ్రీన్‌ కలర్‌ జెర్సీల్లో బరిలోకి దిగిన 2011 సీజన్‌లో డేనియల్ వెటోరీ కెప్టెన్సీలో తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. అయితే ఫైనల్స్‌లో సీఎస్‌కే చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2016 సీజన్‌లోనూ విరాట్ కోహ్లి నేతృత్వంలో ఫైనల్స్‌కు చేరినప్పటికీ తుది సమరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓటమిపాలైంది.

ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే మిగిలిన 2 మ్యాచ్‌ల్లో కనీసం ఓ మ్యాచ్‌లోనైనా గెలవాల్సి ఉంటుంది. ఇతర జట్లతో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో మే 13న పంజాబ్ కింగ్స్‌తో, మే 19న గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది.
చదవండి: T20 WC 2021: రిజ్వాన్‌కు ఆ నిషేధిత మెడిసిన్‌ ఇచ్చాం: పీసీబీ డాక్టర్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement