
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. రాజస్తాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 57 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరి ఢిల్లీ ఓటములకు కారణాలు విశ్లేషిస్తే ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యమే వారి ఓటములకు కారణం అని చెప్పొచ్చు.
తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అతనికి అండగా నిలబడేవారే కరువయ్యారు. మధ్యలో లలిత్ యాదవ్ 38 పరుగులతో నిలకడగా ఆడినప్పటికి అతను ఔట్ అయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది.
Photo: IPL Twitter
అయితే ఆఖరి వరకు నిలబడినప్పటికి జట్టు బ్యాటర్ల నుంచి మద్దతు లేనప్పుడు వార్నర్ మాత్రం ఏం చేయగలడు. అలా చివరికి వార్నర్ 65 పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికే ఢిల్లీ ఓటమి ఖరారైపోయింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ మోస్తరుగా ఉన్నప్పటికి బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం సరిగ్గా లేదని చెప్పొచ్చు.
లక్నోతో ఆడిన తొలి మ్యాచ్‌లో చేజింగ్‌లో విఫలమైంది. లక్నో ఇచ్చిన 194 పరుగుల టార్గెట్‌ను చేధించలేక 143 పరుగుల వద్దే ఆగిపోయింది. ఇక గుజరాత్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. బలమైన బ్యాటింగ్ లైనఫ్ కలిగి ఉన్న గుజరాత్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.
ఇక మూడో మ్యాచ్‌లో చేజింగ్‌లో మరోసారి విఫలమైంది. చాలా స్లోగా ఆడుతున్నాడంటూ వార్నర్‌పై విమర్శలు వచ్చాయి. కానీ అదే వార్నర్ లేకపోతే ఇవాళ ఢిల్లీ ఘోర ఓటమిని చవిచూసేది. అయినా ఒక మ్యాచ్‌లో కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు.. జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తేనే విజయం వరిస్తుంది. కనీసం వచ్చే మ్యాచ్‌లోనైనా ఇది తెలుసుకొని ఢిల్లీ బ్యాటర్లు జట్టుకు తొలి విజయాన్ని అందించాలని కోరుకుందాం.
చదవండి: David Warner: అత్యంత వేగంగా.. కోహ్లి, ధావన్‌ల రికార్డు బద్దలు