PC: IPL Twitter
ఐపీఎల్ 2023లో కష్టపడకుండా అధిక లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అని చెప్పాలి. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు 16. అంటే పరుగుకు కోటి రూపాయల పై మాటే అన్న మాట. ఇంత ఘనకార్యం వెలగబెట్టిన ఈ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్ ఇప్పుడు తగుదునమ్మా అని స్వదేశానికి బయల్దేరాడు.
స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్ (జూన్ 1 నుంచి) ఆడేందుకు స్టోక్స్ సీఎస్‌కే క్యాంప్‌ను వీడాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యమే అధికారికంగా ట్వీట్ చేసింది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు కోట్లు పోసి కొనుక్కున ఫ్రాంచైజీకి పంగనామం పెట్టడంతో స్టోక్స్‌పై సీఎస్‌కే అభిమానులు మండిపడుతున్నారు. కారణాలు ఏవైనా డబ్బులిచ్చాక లీగ్ అయిపోయేంత వరకు ఉండాలని చురకలంటిస్తున్నారు.
దేశం కోసం మాత్రమే ఆడాలనుకున్నప్పుడు.. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ లాగా ఐపీఎల్‌లో పేరు కూడా నమోదు చేసుకోకుండా ఉండాల్సిందంటూ మందలిస్తున్నారు. ఐపీఎల్ ఆడటానికి వచ్చినట్లు లేదు, సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్లుందని అంటున్నారు. కాగా, ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒప్పందం చేసుకున్న ఆటగాడు ఆడినా ఆడకపోయినా పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్‌లో సీఎస్‌కే అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో దూసుకుపోతుంది. ధోని సేన ప్లే ఆఫ్స్‌కు చేరిన రెండో జట్టుగా నిలిచింది. మే 23న జరిగే క్వాలిఫయర్-1లో సీఎస్‌కే.. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొట్టనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇవాల్టి (మే 21) మ్యాచ్‌లతో తేలిపోతాయి. లక్నో ఇదివరకే ఓ బెర్తు కన్ఫర్మ్ చేసుకోగా.. నాలుగో స్థానం కోసం ఆర్సీబీ, రాజస్థాన్, ముంబై ఇండియన్స్ పోటీపడుతున్నాయి.
చదవండి: అప్పటి నుంచి అందరూ గుర్తు పడుతున్నారు.. ఆరోజు ఒక్క బాల్ మిస్ చేసినా!
Comments
Please login to add a commentAdd a comment