సీఎస్‌కేకు మరో బిగ్‌ షాక్‌.. కోట్లు పోసి కొన్న ఆటగాడు ఔట్‌..! | IPL 2023: CSK Ben Stokes Out For A Week | Sakshi
Sakshi News home page

IPL 2023: సీఎస్‌కేకు మరో బిగ్‌ షాక్‌.. కోట్లు పోసి కొన్న మరో ఆటగాడు ఔట్‌..!

Published Sun, Apr 9 2023 6:18 PM | Last Updated on Sun, Apr 9 2023 7:22 PM

IPL 2023: CSK Ben Stokes Out For A Week - Sakshi

photo credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో ఫోర్‌ టైమ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ను గాయాల బెడద వెంటాడుతూ ఉంది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 8) జరిగిన మ్యాచ్‌ సందర్భంగా హ్యామ్‌స్ట్రింగ్‌ ఇంజ్యూరీ తిరగబెట్టడంతో రూ. 14 కోట్ల ఆటగాడు దీపక్‌ చాహర్‌ లీగ్‌లో తదుపరి కొనసాగేది అనుమానంగా మారగా.. తాజాగా మరో ఆటగాడు, రూ. 16.25 కోట్ల ప్లేయర్‌ బెన్‌ స్టోక్స్‌ బొటనవేలి గాయం కారణంగా వారం రోజులు లీగ్‌ను దూరంగా ఉంటాడని తెలుస్తోంది.

సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ చాహర్‌ 4 లేదా 5 మ్యాచ్‌లకే దూరంగా ఉంటాడని చెబుతున్నప్పటికీ అతని గాయం తీవ్రత అధికంగా ఉందని సమాచారం. చాహర్‌ ఇదే గాయం కారణంగా గత సీజన్‌ మొత్తానికి దూరమైన నేపథ్యంలో  ఈ సీజన్‌ పరిస్థితి ఏమోనని సీఎస్‌కే యాజమాన్యం లోలోపల ఆందోళన చెందుతుంది. చాహర్‌ గురించే తలలు పట్టుకున్న సీఎస్‌కేకు స్టోక్స్‌ రూపంలో మరో స్ట్రోక్‌ తగలడంతో బెంబేలెత్తిపోతుంది.

స్టోక్స్‌కు తగిలిన గాయాన్ని చిన్నదిగా చూపించాలని ఎల్లో ఆర్మీ భావిస్తున్నప్పటికీ, ఆ జట్టు కంగారు పడుతున్న తీరు చూస్తుంటే, 16.25 కోట్ల ఆటగాడు సీజన్‌ మొత్తానికే దూరమవుతాడా అన్న అనుమానం కలుగుతుంది. ఇవి చాలవన్నట్లు కోట్లు పోసి సొంతం చేసుకున్న మరో ఆటగాడు మొయిన్‌ అలీ ​కూడా అనారోగ్యంగా ఉన్నాడని తెలుస్తోంది.

ఒకవేళ ఇతను కూడా తదుపరి మ్యాచ్‌లకు దూరమైతే సీఎస్‌కే విజయావకాశాలపై భారీ ప్రభావం పడుతుంది. ఇన్ని టెన్షన్స్‌ మధ్య ముంబైతో మ్యాచ్‌లో రహానే రాణించడం ఒక్కటి సీఎస్‌కేకు ఊరట కలిగిస్తుంది. ఒకవేళ సీఎస్‌కే నిజంగా చాహర్‌, స్టోక్స్‌ సేవలు కొన్ని మ్యాచ్‌లకైనా సరే కోల్పోవాల్సి వస్తే, ఆ జట్టు గత సీజన్‌లో మాదిరే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉండాల్సి వస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement