pic credit: IPL Twitter
ఇటీవలికాలంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, సీఎస్‌కే కీలక ప్లేయర్ రవీంద్ర జడేజా పట్టిందల్లా బంగారమే అవుతుంది. అడుగు పెట్టిన ప్రతి చోట విజయమే పలకరిస్తుంది. గాయం కారణంగా గతేడాది ఓ మోస్తరు విరామం తీసుకున్న జడ్డూ భాయ్, ఆ మధ్యలోనే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య రివాబాను ఎమ్మెల్యేగా గెలిపించుకుని, ఆతర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు.
రీఎంట్రీలో తొలి మ్యాచ్‌లోనే (రంజీ ట్రోఫీతో తమిళనాడుపై 8 వికెట్లు) అదరగొట్టిన జడ్డూ భాయ్, ఆతర్వాత ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ సిరీస్‌లో (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసిన అతను, భారత్ గెలిచిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుపొందాడు.
అతర్వాత ఆసీస్‌తోనే జరిగిన వన్డే సిరీస్‌లోనూ రెచ్చిపోయిన జడేజా, తొలి వన్డేలో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో మరో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. తాజాగా జడ్డూ మరో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కించుకుని, ఈ అవార్డుకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారాడు. ఐపీఎల్-2023లో భాగంగా నిన్న (ఏప్రిల్ 8) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జడేజా బౌలింగ్‌లో (4-0-20-3) అద్భుత ప్రదర్శన కనబర్చి ఈ అవార్డును దక్కించుకున్నాడు.
గత 10 మ్యాచ్‌ల్లో జడేజా ఈ అవార్డును దక్కించుకోవడం ఇది నాలుగో సారి కావడం విశేషం. మరో విశేషమేమిటంటే.. ఐపీఎల్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో జడేజా.. అమిత్ మిశ్రా (12), రహానే (12), కేఎల్ రాహుల్‌లతో సమంగా ఏడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ (18) అగ్రస్థానంలో ఉండగా.. ధోని (17), యూసఫ్ పఠాన్ (16), కోహ్లి (14), రైనా (14), గంభీర్ (13) వరుసగా రెండు నుంచి ఆరు స్థానాల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment