
నితీశ్ రాణా (Photo Credit: iplt20.com)
IPL 2023- Kolkata Knight Riders vs Royal Challengers Bangalore: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణా ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మండిపడ్డాడు. చెత్త షాట్ సెలక్షన్‌తో వికెట్ సమర్పించుకున్నాడని విమర్శించాడు. జట్టు కష్టాల్లో ఉన్నపుడు రాణా సంగాలా మారుదామనుకున్నాడని.. కానీ, పూర్తిగా విఫలమయ్యాడని విమర్శలు చేశాడు.
కాగా ఐపీఎల్-2023లో తమ రెండో మ్యాచ్‌లో కేకేఆర్ గురువారం ఆర్సీబీతో తలపడింది. ఈ మ్యాచ్ ఆరంభంలోనే వెంకటేశ్ అయ్యర్(3), వన్‌డౌన్ బ్యాటర్ మన్‌దీప్ సింగ్(0) అవుటయ్యారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ నితీశ్ రాణా సైతం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత రింకూ సింగ్(46), శార్దూల్ ఠాకూర్ (68) అద్భుత ఇన్నింగ్స్‌తో 204 పరుగులు చేసిన కేకేఆర్.. వరుణ్ చక్రవర్తి సహా మిగతా బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో 123 పరుగులకే ఆర్సీబీని కట్టడి చేసింది. ఈ క్రమంలో 81 పరుగుల తేడాతో కేకేఆర్ ఈ సీజన్‌లో తొలి గెలుపు నమోదు చేసింది.
అసలు ఎలాంటి షాట్ ఆడుతున్నాడో?!
ఈ నేపథ్యంలో కేకేఆర్ ఇన్నింగ్స్ సాగిన విధానం ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘కేకేఆర్ ఆరంభంలోనే తడబడింది. రీస్ టోప్లే స్థానంలో వచ్చిన డేవిడ్ విల్లే వరుస బంతుల్లో రెండు వికెట్లు కూల్చాడు.
ఓపెనర్‌గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ త్వరగానే అవుటయ్యాడు. ఇక మన్‌దీప్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. జట్టులో అతడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడన్న విషయంపై మనకు సందేహాలు రాకమానవు. ఆ తర్వాత నితీశ్ రాణా. అసలు ఎలాంటి షాట్ ఆడుతున్నాడో తనకైనా అర్థమైందో లేదో?! రాణా సంగా అవుదామనుకున్నాడు.
కానీ.. ఎక్కువసేపు నిలవలేక అవుటై పోయాడు. మైకేల్ బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. తర్వాత ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్, రింకూ సింగ్ మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశారు. గుర్బాజ్ అద్భుతంగా ఆడాడు.
రింకూ సూపర్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. రసెల్ పూర్తిగా నిరాశపరచగా.. శార్దూల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కోల్‌కతా 204 పరుగుల మార్కును చేరుకోగలిగింది’’ అని పేర్కొన్నాడు. కాగా ఏడో ఓవర్ మొదటి బంతికి బ్రాస్‌వెల్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయిన నితీశ్ రాణా.. దినేశ్ కార్తిక్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
చదవండి: అస్సలు ఊహించలేదు.. అందరి అంచనాలు తలకిందులు చేశాడు: మాజీ ప్లేయర్