IPL 2024: డారిల్‌ మిచెల్‌ ఖాతాలో అరుదైన రికార్డు | Sakshi
Sakshi News home page

IPL 2024: డారిల్‌ మిచెల్‌ ఖాతాలో అరుదైన రికార్డు

Published Mon, Apr 29 2024 11:13 AM

IPL 2024 CSK VS SRH: Daryl Mitchell Equals Record Of Taking Most Catches By A Non Wicket Keeper In An IPL Innings

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 28) జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు డారిల్‌ మిచెల్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదు క్యాచ్‌లు పట్టిన మిచెల్‌.. ఓ ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రెండో నాన్‌ వికెట్‌కీపర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

2021 సీజన్‌లో మొహమ్మద్‌ నబీ (సన్‌రైజర్స్‌).. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి (ఓ ఇన్నింగ్స్‌లో) ఐదు క్యాచ్‌ల ఘనత సాధించాడు. వికెట్‌కీపర్లలో కుమార సంగక్కర ప్రస్తుతం కనుమరుగైన డెక్కన్‌ ఛార్జర్స్‌ తరఫున గతంలో ఈ ఫీట్‌ను సాధించాడు. 2011 సీజన్‌లో సంగక్కర ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌ల ప్రదర్శన నమోదు చేశాడు.

 

 మ్యాచ్‌ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో డారిల్‌ మిచెల్‌ తొలుత బ్యాట్‌తో రాణించి (52), ఆతర్వాత ఫీల్డ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ విధ్వంసకర ఆటగాళ్లను ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. మిచెల్‌.. ట్రవిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, క్లాసెన్‌, కమిన్స్‌, షాబాజ్‌ అహ్మద్‌ క్యాచ్‌లు పట్టాడు. ఈ మ్యాచ్‌లో మిచెల్‌తో పాటు రుతురాజ్‌ గైక్వాడ్‌ (54 బంతుల్లో 98) కూడా చెలరేగడంతో సన్‌రైజర్స్‌పై సీఎస్‌కే 78 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

 

తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. రుతురాజ్‌, డారిల్‌ మిచెల్‌ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. భువనేశ్వర్‌, నటరాజన్‌, ఉనద్కత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన సన్‌రైజర్స్‌.. 18.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. తుషార్‌ దేశ్‌ పాండే (3-0-27-4), ముస్తాఫిజుర్‌ (2.5-0-19-2), పతిరణ (2-0-17-2), రవీంద్ర జడేజా (4-0-22-1), శార్దూల్‌ ఠాకూర్‌ (4-0-27-1) సన్‌రైజర్స్‌ పతనాన్ని శాశించారు. 

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో 32 పరుగులు చేసిన మార్క్రమ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ట్రవిస్‌ హెడ్‌ (13), అభిషేక్‌ శర్మ (15), నితీశ్‌ రెడ్డి (15), క్లాసెన్‌ (20), అబ్దుల్‌ సమద్‌ (19) రెండంకెల స్కోర్లు చేశారు. ఈ గెలుపుతో సీఎస్‌కే మూడో స్థానానికి ఎగబాకగా.. ఆ స్థానంలో ఉండిన సన్‌రైజర్స్‌ నాలుగో స్థానానికి పడిపోయింది. 

Advertisement
Advertisement