ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆర్సీబీ.. కేకేఆర్‌తో ఆడిన తమ చివరి మ్యాచ్‌లో హోం గ్రౌండ్‌లో పరాజయం చవిచూసింది.
ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉండగా.. లక్నో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ ఓటమితో ఆరో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ.. సీఎస్‌కే, కేకేఆర్ చేతుల్లో ఓడి పంజాబ్‌పై గెలుపొందగా.. రాజస్థాన్ చేతిలో ఓడిన లక్నో.. పంజాబ్‌పై విజయం సాధించింది.
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే..
ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు ఎదురెదురుపడగా.. మూడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ, ఓ మ్యాచ్‌లో లక్నో గెలుపొందాయి. ఐపీఎల్‌లో లక్నోపై ఆర్సీబీ స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది.
మెరుగ్గా కనిపిస్తున్న లక్నో..
అయితే ప్రస్తుత సీజన్‌లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఆర్సీబీతో పోలిస్తే ఎల్‌ఎస్‌జీ పటిష్టంగా కనిపిస్తుంది. డికాక్, రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్, కృనాల్ పాండ్యా, ఆయుశ్ బదోనిలతో కూడిన లక్నో బ్యాటింగ్ లైనప్ బలహీనమైన ఆర్సీబీ బౌలింగ్‌కు సవాలు విసురుతుంది.
బౌలింగ్ విభాగంలోనూ లక్నో ఆర్సీబీ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. సంచలన పేసర్ మయాంక్ యాదవ్, నవీన్ ఉల్ హక్, మొహిసిన్ ఖాన్, రవి భిష్ణోయ్, కృనాల్‌తో లక్నో బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.
ఆర్సీబీ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఈ జట్టు పేపర్‌పై పటిష్టంగానే కనిపిస్తున్నా.. ఒక్క విరాట్ కోహ్లి మాత్రమే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో రాణించాడు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, గ్రీన్‌లు ఇప్పటివరకు బ్యాట్‌కు పని చెప్పలేదు. దినేశ్ కార్తీక్ ఆఖర్లో తన పాత్రను న్యాయం చేస్తున్నాడు. కోహ్లి, కార్తీక్ మినహా ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేవు.
బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో ఆర్సీబీ చాలా పూర్‌గా ఉంది. సిరాజ్, యశ్ దయాల్, అల్జరీ జోసఫ్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ రాణించలేదు. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ బౌలింగ్ లైనప్ అత్యంత బలహీనమైనదిగా కనిపిస్తుంది. మరి లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment