మయాంక్ యాదవ్ (PC: IPL/LSG)
ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్ శుక్రవారం సొంత మైదానంలో మరో మ్యాచ్ ఆడనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో అటల్ బిహారీ వాజ్‌పేయి ఏక్నా స్టేడియంలో తలపడేందుకు సిద్దమైంది.
అయితే, ఈ మ్యాచ్‌కు లక్నో యుంగ్ స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. తదుపరి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు కూడా అతడు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా 21 ఏళ్ల పేస్ సంచలనం మయాంక్ యాదవ్ గాయపడిన విషయం తెలిసిందే.
ఆ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి మైదానం వీడిన మయాంక్.. తీవ్రమైన తొంటి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ విలువైన ఆటగాడిని కాపాడుకోవాలని.. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే అతడిని మళ్లీ బరిలోకి దించాలని లక్నో యాజమాన్యం భావిస్తోంది.
ఈ విషయం గురించి లక్నో సూపర్ జెయింట్స్ కోచ్ జస్టిన్ లాంగర్ మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఏప్రిల్ 19 నాటి మ్యాచ్ కోసం మయాంక్‌ను ఫిట్‌గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. మయాంక్ లాంటి ప్రతిభావంతుడి సేవలను ప్రతీ మ్యాచ్‌లో ఉపయోగించుకోవాలని భావించడం సహజమేనన్న లాంగర్.. అన్నింటికంటే అతడి ఫిట్‌నెస్‌గా ఉండటం ముఖ్యమని పేర్కొన్నాడు.
ఢిల్లీతో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు మయాంక్ సిద్ధమయ్యాడని.. అయితే పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాతే మళ్లీ ఆడిస్తామని లాంగర్ తెలిపాడు. ఢిల్లీతో పాటు కేకేఆర్‌తో మ్యాచ్‌కు కూడా మయాంక్ దూరంగా ఉంటాడని ఈ సందర్భంగా జస్టిన్ లాంగర్ వెల్లడించాడు.
కాగా గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతున్న మయాంక్ యాదవ్ అరంగేట్రంలోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ యూపీ పేసర్ 3/27తో సత్తా చాటాడు.
లక్నోను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ మూడు వికెట్లు పడగొట్టి మరోసారి ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, దురదృష్టవశాత్తూ గాయం కారణంగా వరుస మ్యాచ్‌లకు మయాంక్ యాదవ్ దూరం కానున్నాడు. అతడి స్పీడ్ డెలివరీలను చూడాలనుకున్న అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్‌న్యూస్!!
చదవండి: IPL 2024 MI VS RCB: ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment