ఈసారి ధోని నాకు బౌలింగ్ ఇవ్వనన్నాడన్న తీక్షణ(PC: IPL/BCCI/AP)
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న యువ క్రికెటర్లలో శ్రీలంక బౌలర్ మహీశ్ తీక్షణ ఒకడు. 2021లో లంక తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్.. మూడు ఫార్మాట్లలోనూ దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక సభ్యుడిగా ఎదిగి జట్టులో తన స్థానం సుసిర్థం చేసుకున్నాడు. కాగా మహీశ్ తీక్షణ 2022లో ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు అతడు ఆడుతున్న విషయం తెలిసిందే.
అనుకున్న ఫలితాలు రాబడుతూ..
తీక్షణ బౌలింగ్ నైపుణ్యాలను వినియోగించుకుంటూ.. ఎప్పటికప్పుడు అతడిని ప్రోత్సహిస్తూ జట్టుకు కావాల్సిన ఫలితాలు రాబట్టాడు తలా. అంతేకాదు విమర్శలు వచ్చిన సమయంలోనూ అతడికి అండగా నిలబడ్డాడు. ఈ విషయాన్ని మహీశ్ తీక్షణ తాజాగా పునరుద్ఘాటించాడు.
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024లో.. షార్జా వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న తీక్షణ.. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ధోనితో తన అనుబంధం గురించి పంచుకున్నాడు. ఐపీఎల్-2024లో ధోని తనకు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వనన్నాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నన్ను హగ్ చేసుకున్నారు.. ఇకపై బౌలింగ్ వద్దన్నారు!
‘‘ఐపీఎల్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత నేను, మతీశ పతిరణ మా దేశానికి పయనం కావాల్సి ఉంది. అప్పటికే పార్టీ ముగించుకున్నాం. అయితే, వెళ్లేముందు ఒకసారి ధోనిని కలిసి వీడ్కోలు చెప్పాలని అనుకున్నాం. ఆయన మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించారు. నన్ను ఆలింగనం చేసుకుని.. ‘వచ్చే సీజన్‌లో నీకు బౌలింగ్ ఛాన్స్ ఇవ్వను.
నువ్వు కేవలం బ్యాటింగ్, ఫీల్డింగ్ మాత్రమే చేయాలి’ అని నాతో అన్నారు’’ అంటూ తమ మధ్య జరిగిన సరదా సంభాషణను తీక్షణ వెల్లడించాడు. అదే విధంగా తనపై విమర్శలు వచ్చిన సమయంలో ధోని అండగా నిలబడిన తీరును ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు.
క్యాచ్‌లు డ్రాప్ చేసినా నన్ను నమ్మారు
‘‘గతేడాది నా ఫీల్డింగ్ సరిగ్గా లేదు. కనీసం 4- 5 క్యాచ్‌లు డ్రాప్ చేశాను. అందుకు నేనే జవాబుదారీగా ఉన్నాను. ఏదేమైనా వాళ్లు(మేనేజ్‌మెంట్) నాపై నమ్మకం కోల్పోలేదు. నన్ను తుదిజట్టు నుంచి తప్పించలేదు. అందుకే ధోనితో కలిసి ఆడటం అందరికీ అంత ఇష్టం మరి!
మనుషులన్నాక తప్పులు చేయడం సహజం.. ఇంకో అవకాశం ఇస్తే వాటిని కచ్చితంగా సరిదిద్దుకుంటారని ఆయనకు తెలుసు. ఆయనలో నాకు ఎక్కువగా నచ్చే గుణం అదే’’ అంటూ మహీశ్ తీక్షణ తలాపై ప్రశంసలు కురిపించాడు.
ఎల్లవేళలా అండగా ధోని
కాగా గతేడాది ఐపీఎల్ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫు మహీశ్ తీక్షణ 11 వికెట్లు తీశాడు. తద్వారా సీఎస్‌కే ఏకంగా ఐదోసారి ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కొన్ని కీలక మ్యాచ్‌లలో క్యాచ్‌లు డ్రాప్ చేయడం వల్ల అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి.
అలాంటి సమయంలో ధోని తనకు అండగా నిలిచాడని తాజా ఇంటర్వ్యూలో 23 ఏళ్ల తీక్షణ గుర్తు చేసుకున్నాడు. అతడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
చదవండి: Ind vs Eng: వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు
Comments
Please login to add a commentAdd a comment