పల్లెకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నారు.
ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో బెంచ్‌కే పరిమితమైన శాంసన్‌కు.. రెండో టీ20లో ఆడే ఛాన్స్ లభించింది. గిల్ స్ధానంలో ఓపెనర్‌గా వచ్చిన శాంసన్.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.
ఈ క్రమంలో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో శాంసన్ కంటే యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కే ఎక్కువ అవకాశాలు దక్కుతాయని పఠాన్ జోస్యం చెప్పాడు. కాగా లంకతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ రియాన్ భారత జట్టులో భాగమయ్యాడు. మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమై పరాగ్.. బౌలింగ్‌లో మాత్రం 3 వికెట్లతో సత్తాచాటాడు. రెండో మ్యాచ్‌లోనూ తన 4 ఓవర్ల బౌలింగ్ కోటాను ఈ అస్సాం ఆల్‌రౌండర్ పూర్తి చేశాడు.
"భారత జట్టులో రియాన్ పరాగ్‌కు ఎక్కువగా అవకాశాలు లభిస్తాయి. ఎందుకంటే టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లలో ఎవరికి బౌలింగ్ చేసే సామర్థ్యం లేదు. అదే అతడికి బాగా కలిసిస్తోందని" ఎక్స్‌లో పఠాన్ రాసుకొచ్చాడు. ఐపీఎల్-2024లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో పరాగ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పరాగ్‌ను ఎక్స్ ఫ్యాక్టర్ అని కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment