ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ | Jake Fraser-McGurk rediscovers form with 39-ball 110-run knock before IPL 2025 | Sakshi
Sakshi News home page

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ విధ్వంసం.. 37 బంతుల్లో సెంచరీ

Published Fri, Mar 21 2025 8:05 AM | Last Updated on Fri, Mar 21 2025 5:15 PM

Jake Fraser-McGurk rediscovers form with 39-ball 110-run knock before IPL 2025

ఐపీఎల్‌-2025లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమవుతోంది. మార్చి 24న విశాఖపట్నం వేదికగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనుంది. ఇప్పటికే వైజాగ్‌ చేరుకున్న ఢిల్లీ జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.

ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లు గురువారం రెండు జట్లగా విడిపోయి ఇంట్రాస్క్వాడ్‌​ మ్యాచ్‌ ఆడారు. ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా యువ సంచలనం, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. 

ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌-ఎ జట్టు తరపున ఆడిన మెక్‌గర్క్‌.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వైజాగ్‌ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 39 బంతులు మాత్రమే ఎదుర్కొన్న జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌.. 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 110 పరుగులు చేశాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా ఢిల్లీ-ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 289 పరుగుల భారీ స్కోర్‌ చేయగల్గింది. మెక్‌గర్క్‌ ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

కాగా జేక్‌ ఫ్రేజర్ మెక్‌గర్క్ ఐపీఎల్‌-2024 సీజన్‌తో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. అరంగేట్రంలోనే ఈ యువ సంచలనం తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. జేక్‌ ఫ్రేజర్‌ దూకుడుగా ఆడటంలో స్పెషలిస్ట్. 
గతేడాది సీజన్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన జేక్‌ ఫ్రేజర్‌.. 234.04 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం అతడు తన మార్క్‌ను చూపించలేకపోయాడు. ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడిన ఫ్రేజర్‌ కేవలం 221 పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవల జరిగిన బిగ్‌బాష్‌ లీగ్‌లో సైతం అతడు తీవ్ర నిరాశపరిచాడు. 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 188 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయినప్పటికి మరోసారి అతడిపై ఢిల్లీ క్యాపిటల్స్‌ నమ్మకం ఉంచింది. ఐపీఎల్‌-2025 మెగా వేలంలో రూ.9 కోట్ల భారీ ధరకు జేక్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ కొనుగోలు చేసింది.
చదవండి: షకీబ్‌కు బిగ్‌ రిలీఫ్‌.. బౌలింగ్‌కు లైన్‌ క్లియర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement