షమీకి సహచరుల అభినందన, బుమ్రా
బుమ్రా అంటే భారత బౌలింగ్ తురుపుముక్క. పేస్ దళానికి ఏస్ బౌలర్. పదునైన బంతులతో నిప్పులు చెరగడం, యార్కర్లతో వికెట్లను కూల్చడం అతనికి బాగా తెలిసిన పని. మరి బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీ చేయడం మనమెప్పుడు చూడలేదు కదా! ఇప్పుడు ఆ ముచ్చట కూడా చూపించేశాడు. పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకున్నాడు. తర్వాత తన బౌలింగ్ విన్యాసంతో ఆసీస్ ‘ఎ’ పతనంలో భాగమయ్యాడు. దీంతో తొలి రోజే ఇరు జట్లు ఆలౌట్ అయ్యాయి.
సిడ్నీ: డే అండ్ నైట్ టెస్టుకు సన్నాహకంగా నిర్వహిస్తున్న పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (57 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు; బౌలింగ్‌లో 2 వికెట్లు) అనూహ్యంగా ఆల్‌రౌండర్ అవతారం ఎత్తాడు. బ్యాటింగ్‌లో అజేయంగా రాణించిన అతను భారత ఇన్నింగ్స్‌లో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బౌలింగ్‌లోనూ నిప్పులు చెరిగాడు. మ్యాచ్‌ను వర్షం ఆటంక పరచడంతో సుమార గంటపాటు మ్యాచ్ సాగలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 194 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 32.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. క్యారీ (32; 6 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. షమీ, సైనీ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
బుమ్రా ఆల్‌రౌండ్ ప్రాక్టీస్
ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (2) ఎక్కువసేపు నిలువలేకపోయినా... పృథ్వీ షా (40; 8 ఫోర్లు), శుబ్‌మన్ గిల్ (43; 6 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్‌ను నడిపించారు. రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించాక పృథ్వీ షా పెవిలియన్ చేరాడు. జట్టు స్కోరు 100 పరుగులు దాటాక ఇన్నింగ్స్ గతి తప్పింది. హనుమ విహారి (15), గిల్, కెప్టెన్ అజింక్య రహానే (4), పంత్ (5), సాహా (0), షమీ (0) టపటపా వికెట్లను పారేసుకున్నారు. దీంతో 14 పరుగుల వ్యవధిలోనే భారత్ 6 వికెట్లను కోల్పోయింది. అయితే పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన బుమ్రా, సిరాజ్ (22; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ముఖ్యంగా బుమ్రా ధాటిగా ఆడాడు. సదర్‌లాండ్ వేసిన బౌన్సర్‌ను హుక్ షాట్‌తో సిక్సర్‌గా తరలించిన అతను అర్ధ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. ఆఖరి వికెట్‌కు 71 పరుగులు జోడించాక సిరాజ్ అవుటవ్వడంతో 200 పరుగులకు ముందే భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఆసీస్ ‘ఎ’ విలవిల
భారత్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామన్న ఆనందం ఆసీస్ ‘ఎ’ జట్టులో ఎంతో సేపు నిలువలేదు. ఓపెనర్ బర్న్స్ (0)ను బుమ్రా... బెన్ మెక్‌డెర్మట్ (0)ను షమీ ఖాతానే తెరవనీయలేదు. మరో ఓపెనర్ హారిస్ (26; 4 ఫోర్లు) కాసేపు, కెప్టెన్ క్యారీ కాసేపు ఆడినా... వాళ్లిద్దరిని అవుట్ చేసేందుకు భారత సీమర్లకు ఎంతో సేపు పట్టలేదు. దీంతో 56 పరుగులకే ఐదు వికెట్లను... వందకంటే ముందే 9 వికెట్లను ఆతిథ్య జట్టు కోల్పోయింది.
కోహ్లి దూరం
12 రోజుల వ్యవధిలో ఆరు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఊహించిన విధంగానే ఈ మ్యాచ్ బరిలోకి దిగలేదు. మ్యాచ్ ఆడకపోయినా...సిడ్నీ ప్రధాన స్టేడియం బయట నెట్స్‌లో కోహ్లి సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేశాడు. అనూహ్యంగా భారత్ నలుగురు పేసర్లతోనే ఆడింది. అయితే ఇందులో సీనియర్ ఉమేశ్ యాదవ్‌కు మాత్రం అవకాశం ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: పృథ్వీ షా (బి) సదర్‌లాండ్ 40; మయాంక్ (సి) బర్న్స్ (బి) అబాట్ 2; శుబ్‌మన్ (సి) క్యారీ (బి) గ్రీన్ 43; విహారి (బి) విల్డర్‌మత్ 15; రహానే (సి) క్యారీ (బి) విల్డర్‌మత్ 4; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) విల్డర్‌మత్ 5; సాహా (సి)సదర్‌లాండ్ (బి) అబాట్ 0; సైనీ (సి) మ్యాడిన్సన్ (బి) కాన్వే 4; షమీ (సి) క్యారీ (బి) అబాట్ 0; బుమ్రా నాటౌట్ 55; సిరాజ్ (సి) హరిస్ (బి) స్వెప్సన్ 22; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (48.3 ఓవర్లలో ఆలౌట్) 194.
వికెట్ల పతనం: 1–9, 2–72, 3–102, 4–102, 5–106, 6–111, 7–111, 8–116, 9–123, 10–194.
బౌలింగ్: అబాట్ 12–6–46–3, కాన్వే 11–3–45–1, సదర్‌లాండ్ 9–0–54–1, గ్రీన్ 6.1–2–20–1, విల్డర్‌మత్ 8–4–13–3, స్వెప్సన్ 2.2–0–15–1.
ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: హారిస్ (సి) శుబ్‌మన్ (బి) షమీ 26; బర్న్స్ (సి) పంత్ (బి) బుమ్రా 0; మ్యాడిన్సన్ (సి) సాహా (బి) సిరాజ్ 19; మెక్‌డెర్మట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షమీ 0; క్యారీ (సి) పంత్ (బి) సైనీ 32; అబాట్ (సి) పంత్ (బి) షమీ 0; విల్డర్‌మత్ (సి) పంత్ (బి) బుమ్రా 12; సదర్‌లాండ్ (సి) శుబ్‌మన్ (బి) సైనీ 0; ప్యాట్రిక్ నాటౌట్ 7; స్వెప్సన్ (సి) సాహా (బి) సైనీ 1; కాన్వే రనౌట్ 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (32.2 ఓవర్లలో ఆలౌట్) 108.
వికెట్ల పతనం: 1–6, 2–46, 3–46, 4–52, 5–56, 6–83, 7–84, 8–97, 9–99, 10–108.
బౌలింగ్: షమీ 11–4–29–3; బుమ్రా 9–0–33–2, సిరాజ్ 7–1–26–1, సైనీ 5.2–0–19–3.
గ్రీన్ దిమ్మదిరిగింది
టెస్టు సిరీస్‌కు ముందు అసలే గాయాలతో సతమతమవుతున్న ఆసీస్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. దూకుడుగా బ్యాటింగ్ చేసిన బుమ్రా... ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ బుర్ర బద్దలయ్యే షాట్ ఆడాడు. గ్రీన్ బౌలింగ్‌లో బుమ్రా కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలర్ తలకు బలంగా తగిలింది. దీంతో గ్రీన్ ఒక్కసారిగా పిచ్‌పైనే కూలబడ్డాడు. నాన్ స్ట్రయిక్‌లో ఉన్న సిరాజ్ పరుగును, బ్యాట్‌ను పక్కన పడేసి గ్రీన్ వద్దకు పరుగెత్తాడు. ఆసీస్ జట్టు వైద్య సిబ్బంది అతన్ని మైదానం వెలుపలికి తీసుకెళ్లి పరీక్షించింది. అతని స్థానంలో ‘కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్’గా బ్యాట్స్‌మన్ ప్యాట్రిక్ రోవ్‌ను బరిలోకి దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment