ఐపీఎల్-2023 మినీ వేలానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ, విదేశీ స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. పేర్ల నమోదుకు బీసీసీఐ డిసెంబర్ 15ను డెడ్‌లైన్‌గా ప్రకటించడంతో ఈ ప్రక్రియ మరింత ఊపందుకుంది. టీ20 వరల్డ్‌కప్-2022 హీరోలు బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, ఆదిల్ రషీద్, ఆసీస్ నయా సంచనలం కెమరూన్ గ్రీన్ ఇదివరకే తమ పేర్లను ఎన్‌రోల్ చేసుకోగా.. తాజాగా ఇంగ్లండ్ టెస్ట్ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్ కూడా వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. బేస్ ధర 2 కోట్లకు రూట్ తన పేరును కోట్ చేసినట్లు తెలుస్తుంది. డిసెంబర్ 23న జరుగనున్న వేలంలో 10 ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఆటగాళ్లతో కలుపుకునే మొత్తం 250 మంది వరకు వేలంలో పాల్గొనవచ్చని బీసీసీఐ అంచనా వేస్తుంది.
ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో కేవలం టెస్ట్‌లకే పరిమితమైన రూట్ (అడపాదడపా వన్డేలు ఆడుతున్నాడు).. 2023 ఐపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత కొంతకాలంగా ఆటలో వేగం తగ్గి, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న రూట్.. ఐపీఎల్‌లో అవకాశం వస్తే సత్తా చాటి తిరిగి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు. రూట్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పటికే కేన్ మామ లాంటి ఆటగాళ్లు సంబంధిత ఫ్రాంచైజీల నుంచి తప్పించబడి, తమను కనీస ధరకైనా కొనుక్కుంటారా లేక లీగ్ నుంచి మర్యాదగా తప్పుకోవడం ఉత్తమమా అన్న డైలమాలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పొట్టి క్రికెట్ ఆడి చాలా రోజులైన రూట్‌ను ఎవరైనా పట్టించుకుంటారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కేన్ మామకు, రూట్‌కు టెస్ట్ క్రికెట్‌లో ఘనమైన రికార్డే ఉన్నప్పటికీ.. నిదానంగా ఆడతారన్న ముద్ర ఉండటంతో వీరిని ఈ వేలంలో ఎవరు కొనుగోలు చేసే అవకాశం లేదు. గత సీజన్‌కు ముందు జరిగిన మెగా వేలంలో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా వేలంలో తన పేరును నమోదు చేసుకుని భంగపడ్డాడు. టెస్ట్‌ల్లో స్మిత్‌కు కూడా మంచి రికార్డే ఉన్నప్పటికీ అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. కాబట్టి త్వరలో జరుగబోయే మినీ వేలంలో ఈ టెస్ట్ హీరోలను ఎవరైనా కొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment