
ముంబై: సరిగ్గా 14 సంవత్సరాల క్రితం ఇదే రోజున(జూన్ 29) క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఫార్మాట్‌లో 15 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సచిన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 227 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. సచిన్ (106 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ అర్ధశతకం సాయంతో దక్షిణాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలోనే సచిన్.. వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని దాటాడు. నాడు నెలకొల్పిన ఈ రికార్డు నేటికీ చెక్కుచెదరకపోవడం విశేషం.
కాగా, 15 నవంబరు 1989లో టెస్ట్ క్రికెట్‌లో కాలు మోపిన సచిన్.. అదే ఏడాది డిసెంబరు 18న తొలి వన్డే ఆడాడు. 200 టెస్టుల్లో 68 అర్ధశతకాలు, 51 శతకాల సాయంతో 15,921 పరుగులు సాధించిన సచిన్.. 463 వన్డేల్లో 96 హాఫ్ సెంచరీలు, 49 సెంచరీల సాయంతో 18,426 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్‌లో తొలి ద్విశతకంతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకన్న ఈ క్రికెట్ దేవుడు.. 23 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు వన్డే క్రికెట్లో కొనసాగాడు. ఈ క్రమంలో ఆయన ఆరు వన్డే ప్రపంచకప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సచిన్ సభ్యుడు.
చదవండి: 'చెత్త' పనికి పరిహారం కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment