అదేంటో.. వరల్డ్‌కప్‌కి ముందే గుర్తుకొస్తాడు! తుదిజట్టులో ఉండాలి: మాజీ ఓపెనర్‌ | Just Before WC, Indian Cricket Suddenly Remembers Ashwin: Aakash Chopra | Sakshi
Sakshi News home page

సరిగ్గా వరల్డ్‌కప్‌కి ముందే.. అకస్మాత్తుగా అలా గుర్తుకొస్తాడు! ఎందుకో?: భారత మాజీ బ్యాటర్‌

Published Wed, Sep 20 2023 12:51 PM | Last Updated on Tue, Oct 3 2023 7:19 PM

Just Before WC Indian Cricket Suddenly Remembers Ashwin: Aakash Chopra - Sakshi

వీవీఎస్‌ లక్ష్మణ్‌, సాయిరాజ్‌ బహుతులేతో అశ్విన్‌ (PC: Ashwin)

India vs Australia ODI Series 2023: ‘‘అదేంటో.. ప్రతిసారి ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందే ఇలా జరుగుతూ ఉంటుంది. గత రెండు.. మూడు ఐసీసీ ఈవెంట్లను గమనిస్తే.. అది టీ20 లేదంటే వన్డే.. ఏదైనా కావొచ్చు.. అప్పటికప్పుడు అతడిని ఎంపిక చేస్తారు.

సరిగ్గా మెగా టోర్నీకి ముందే.. భారత క్రికెట్‌ మేనేజ్‌మెంట్‌కు అశ్విన్‌ గుర్తుకు వస్తాడు’’ అని టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో భారత జట్టులో వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు చోటు దక్కడంపై ఈ విధంగా స్పందించాడు.

వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు
సొంతగడ్డపై... వన్డే వరల్డ్‌కప్‌-2023 ఆరంభానికి ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో అనూహ్యంగా సెలక్టర్ల నుంచి అశ్విన్‌కు పిలుపు వచ్చింది. ఆసియా కప్‌-2023 సందర్భంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌ గాయపడిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే శ్రీలంకతో ఫైనల్లో అక్షర్‌ స్థానాన్ని భర్తీ చేసిన వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు ఈ వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌కు కూడా చోటిచ్చారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా.. అశ్విన్‌ రీఎంట్రీ గురించి మాట్లాడుతూ..

తుదిజట్టులో ఉండాలి
‘‘ప్రపంచకప్‌నకు ఎంపిక చేసిన జట్టులో ఆఫ్‌ స్పిన్నర్‌ లేడు. ఇప్పుడు అక్షర్‌ పటేల్‌ గాయం కారణంగా అకస్మాత్తుగా ఖాళీ ఏర్పడింది. వాషింగ్టన్‌ సుందర్‌తో పాటు అశ్విన్‌ కూడా రేసులోకి దూసుకొచ్చాడు.

అయినా.. ప్రతిసారి అశ్విన్‌కు ఇలా హఠాత్తుగా పిలుపు రావడం చూస్తూనే ఉన్నాం. ఏదేమైనా ఆస్ట్రేలియాతో తుది జట్టులో అతడికి స్థానం ఇవ్వాలి. వాషీ కంటే ఎంతో అనుభవజ్ఞుడైన అశ్విన్‌కే పెద్దపీట వేస్తారని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 

అప్పుడు కూడా అలాగే..
2017 తర్వాత ఆరేళ్ల వ్యవధిలో కేవలం రెండు వన్డేలు ఆడిన అశ్విన్‌.. అక్షర్‌ గాయం కారణంగా ఆసీస్‌తో సిరీస్‌ సందర్భంగా జట్టులోకి వచ్చాడు. ఫార్మాట్లకు అతీతంగా వికెట్లు తీయగల నైపుణ్యం ఉన్న అశూకు.. ఒకవేళ ఈవెంట్‌ ఆరంభం నాటికి అక్షర్‌ కోలుకోకపోతే ఆఫ్‌ స్పిన్నర్‌గా వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఖాయం కావొచ్చు కూడా!

కాగా అంతర్జాతీయ టీ20 కెరీర్‌ ముగిసిందనుకున్న తరుణంలో గతేడాది ఆస్ట్రేలియాలో వరల్డ్‌కప్‌ ఆడిన జట్టులో ఈ చెన్నై స్పిన్‌ ఆల్‌రౌండర్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాటల్ని బట్టి.. ఈసారి కూడా అదే రిపీట్‌ అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం!

కాగా ఎన్సీఏలో ఇటీవల వైట్‌బాల్‌తో ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను అశూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. ‘వరల్డ్‌కప్‌ నాటికి జట్టులోకి అన్న రావడం ఫిక్స్‌’ అంటూ అభిమానులు అప్పటి నుంచే కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: వరల్డ్‌కప్‌కు ముందు మహ్మద్‌ షమీకి బిగ్‌ రిలీఫ్‌.. బెయిల్‌ మంజూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement