కశ్మీర్ ప్రీమియర్ లీగ్ టోర్నీ నిర్వహణపై నెమ్మదిగా నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ కేపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. భారత్-పాక్ ‘కశ్మీర్’ వివాదాల నడుమ తలదూర్చడం తనకు ఇష్టం లేదని పనేసర్ ఓ ట్వీట్ కూడా చేశాడు. దీంతో పనేసర్ దారిలో మరికొందరు ఆటగాళ్లు పయనించే అవకాశం ఉందని, టోర్నీ జరగడం అనుమానమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఇవాళ ఉదయం ఓ భారత మీడియా హౌజ్‌తో మాట్లాడిన పనేసర్.. బీసీసీఐ తీరును పరోక్షంగా తప్పుబట్టాడు. రాజకీయాలు-ఆటలు ఒక్కటి కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించాడు. ‘ఆడడం ఆడకపోవడం ఆటగాళ్ల ఇష్టం. నాకు ఈసీబీ(ఇంగ్లండ్ బోర్డు) నుంచి స్పష్టమైన సందేశాలు వచ్చాయి. అయితే ఆడితే తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కుంటారో ఆ ఆటగాళ్లకు తెలుసు’ అంటూ పనేసర్ వ్యాఖ్యలు చేశాడు.
I have decided not to participate in the KPL because of the political tensions between India and Pakistan over kashmir issues. I don't want to be in the middle of this , it would make me feel uncomfortable. #KPL2021 #Kashmir #india #Cricket #Pakistan #ENGvIND #TheHundred
— Monty Panesar (@MontyPanesar) August 1, 2021
ఇక దాయాది దేశాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తలు కొనసాగుతున్న టైంలో.. పీవోకేలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఈ లీగ్‌ను నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ఈ తరుణంలో బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహణకు గుర్తింపు ఇవ్వొద్దని, జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని ఐసీసీకు నిన్న ఒక లేఖ రాసింది కూడా. దీంతో పాక్ ప్లేయర్లు, రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో బీసీసీఐపై మండిపడ్డారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో టోర్నీ నిర్వహణ ఆగదని స్పష్టం చేసింది. మరోవైపు పీవోకే లీగ్‌లో ఆడబోయే ఆటగాళ్లపై బీసీసీఐ బెదిరింపులకు పాల్పడుతోందనే, ఈ మేరకు భవిష్యత్తులో జరగబోయే టోర్నీల్లో నిషేధం విధిస్తామని ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ హర్షల్ గిబ్స్ బీసీసీఐని తప్పుబడుతూ ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించాడు. కేపీఎల్ ఆడితే.. ఇక తనను ఏ టోర్నీలకు తీసుకోమని బీసీసీఐ బెదిరిస్తోందని ఆరోపించాడు.
అయితే బీసీసీఐ మాత్రం ఆ ఆరోపణల్ని ఖండించింది. కాగా ఆగస్టు 6 నుంచి మొదలుకానున్న కేపీఎల్ టోర్నీలో ఓవర్సీస్ వారియర్స్, ముజఫర్‌బాద్ టైగర్స్, రావల్‌కోట్ హాక్స్, బాగ్ స్టాలియన్స్, మీర్పూర్ రాయల్స్, కోట్లీ లయన్స్ టీమ్‌లుగా ఉన్నాయి. ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాహిద్ అఫ్రిది, షాబాద్ ఖాన్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్‌లు ఈ ఆరు జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఇక ఈ టోర్నీ నిర్వహణకు మరో నాలుగు రోజుల టైం ఉండగా.. బంతి ఇప్పుడు ఐసీసీ కోర్టులోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment