How Do Dhoni, Kohli And Rohit Sharma Differ As Captains? KL Rahul Answers - Sakshi
Sakshi News home page

ధోని నా మొదటి కెప్టెన్‌.. కోహ్లి ఏమో అలా! రోహిత్‌ వ్యూహాలు అద్భుతం!

Published Thu, May 18 2023 4:57 PM | Last Updated on Thu, May 18 2023 5:04 PM

KL Rahul Answers How Do Dhoni Kohli Rohit Sharma Differ As Captains - Sakshi

కోహ్లితో కేఎల్‌ రాహుల్‌ (Pc: BCCI)

KL Rahul: పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు కేఎల్‌ రాహుల్‌. 2016లో వన్డే, టీ20లలో అడుగుపెట్టిన ఈ కర్ణాటక బ్యాటర్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌గా, ఓపెనర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు.

గాయం కారణంగా
ఐపీఎల్‌లో ప్రస్తుతం లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌.. ఈ సీజన్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడ్డాడు. నొప్పి తీవ్రత కారణంగా ఐపీఎల్‌-2023లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమైన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కూడా ఆడలేకపోతున్నాడు.

శస్త్ర చికిత్స నేపథ్యంలో జట్టుకు దూరమైన రాహుల్‌.. తాజాగా ది రణ్‌వీర్‌ షో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తాను ఇప్పటి వరకు ముగ్గురు కెప్టెన్ల సారథ్యంలో ఆడానన్న రాహుల్‌.. ముగ్గురిలోనూ ఎవరికి వారే ప్రత్యేకమని పేర్కొన్నాడు. 

నా మొదటి కెప్టెన్‌
కాగా ధోని సారథ్యంలో కేఎల్‌ టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిస్టర్‌ కూల్‌ గురించి చెబుతూ.. ‘‘నేను గొప్ప గొప్ప నాయకుల సారథ్యంలో ఆడాను. అందులో మొదటి పేరు ఎంఎస్‌ ధోని. తను నా మొదటి కెప్టెన్‌. 

ఎంతో కూల్‌గా టీమ్‌ను డీల్‌ చేసే విధానం, ఒక్కో ఆటగాడితో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక అనుబంధం పెంచుకునే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను. జట్టులోని ఆటగాళ్లను ప్రోత్సహిస్తే మన కోసం వాళ్లు ఎంతలా కష్టపడతారో ప్రత్యక్షంగా చూశాను. ధోని నుంచి నేను ప్రధానంగా నేర్చుకున్న అంశాలు ఇవే!’’ అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

కోహ్లి ప్రతీ విషయంలో టార్గెట్‌ సెట్‌ చేశాడు
ఇక కోహ్లి గురించి మాట్లాడుతూ.. ‘‘విరాట్‌ కోహ్లి మాకు ఆరేడేళ్ల పాటు నాయకుడిగా ఉన్నాడు. ఆట పట్ల అంకితభావం.. దూకుడుగా ముందుకు సాగడం.. చారిత్రత్మక విజయాలు అందించడం.. ప్రతీ విషయంలోనూ తను ఓ టార్గెట్‌ సెట్‌ చేశాడు. 

జట్టును ముందుండి నడిపిస్తూ.. ఆటగాళ్లను ఎలా ఇన్‌స్పైర్‌ చేయాలో తనకు తెలుసు. విరాట్‌ను చూసి మేము కూడా మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆరాటపడేవాళ్లం. జట్టులోని దాదాపు ప్రతీ ఆటగాడిపై కోహ్లి ప్రభావం ఉండేది’’ అని రాహుల్‌ పేర్కొన్నాడు.

రోహిత్‌ శర్మ వ్యూహాలు అద్భుతం
అదే విధంగా రోహిత్‌ శర్మ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘రోహిత్‌ శర్మ మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. నాయకుడిగా అతడి వ్యూహాలు అమోఘం. మ్యాచ్‌కు ముందు రోహిత్‌ కచ్చితంగా హోంవర్క్‌ చేస్తాడు.

జట్టులోని ప్రతీ ఆటగాడి బలం, బలహీనతలు ఏమిటో తనకు బాగా తెలుసు. లోపాలు ఎలా సరిదిద్దుకోవాలో నేర్చుకునేలా చేస్తాడు. గేమ్‌ను అర్థం చేసుకోవడంలో తనకు తానే సాటి’’ అని రాహుల్‌ ప్రశంసించాడు. ఈ ముగ్గురి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు.

చదవండి: సన్‌రైజర్స్‌తో కీలక మ్యాచ్‌..! బౌలింగ్‌ చేసిన కోహ్లి.. ‘కేజీఎఫ్‌’ వీడియో వైరల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement