విరాట్ కోహ్లి గురించి వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డాడు. పనీపాటా లేని వాళ్లే వదంతులు సృష్టించి జనాల మీదకు వదులుతారని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అసలు కోహ్లి లేని ప్రపంచకప్ జట్టును ఊహించడం కూడా కష్టమన్నాడు.
కాగా టీ20 వరల్డ్‌కప్-2024 భారత జట్టులో కోహ్లికి చోటు ఇవ్వకుండా.. యువకులకు పెద్దపీట వేయాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోహ్లి బ్యాటింగ్ స్టైల్ వెస్టిండీస్ పిచ్‌లకు అంతగా సూట్ కాదని.. అందుకే ఈ ఢిల్లీ బ్యాటర్‌ను తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వదంతులు వ్యాపించాయి.
టీమిండియా గెలవాలంటే అతడు ఉండాల్సిందే
ఈ విషయంపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘విరాట్ కోహ్లి లేకుండా టీ20 ప్రపంచకప్ టీమా? ఛాన్సే లేదు. 2022లో జట్టును సెమీస్‌కు చేర్చిన ఘనత తనది.
ఆ ఎడిషన్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ కూడా అతడే. అలాంటి వ్యక్తికి జట్టులో చోటు ఉండదా? అసలు ఈ పుకార్లు పుట్టిస్తున్నది ఎవరు? వాళ్లకు వేరే పనులేమీ లేవా? నిరాధారపూరిత వ్యాఖ్యలతో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు?
ఒకవేళ ఈసారి టీమిండియా గనుక టీ20 వరల్డ్‌కప్ గెలవాలంటే విరాట్ కోహ్లి కచ్చితంగా జట్టులో ఉండి తీరాల్సిందే’’ అని చిక్కా తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు చెప్పాడు. ఇక ఇదే విషయం గురించి పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా స్పందించాడు.
సచిన్ మాదిరే కోహ్లికి కూడా ఆ గౌరవం దక్కాలి
ఈ మేరకు.. ‘‘వన్డే వరల్డ్‌కప్ లేదంటే టీ20 ప్రపంచకప్.. ఈవెంట్ ఏదైనా.. జట్టును ఒడ్డుకు చేర్చే ఆటగాడు ఉండాల్సిందే. విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లు కేవలం జట్టులో ఉంటే చాలు. అన్నీ సజావుగా సాగిపోతాయి.
వందకు వంద శాతం జట్టుకు కోహ్లి అవసరం ఉంది. కోహ్లి కోసం టీమిండియా కచ్చితంగా ప్రపంచకప్ ట్రోఫీ గెలవాలి. 2011లో సచిన్ టెండుల్కర్‌కు దక్కిన మాదిరే విరాట్ కోహ్లికి కూడా గౌరవం దక్కాలి. అతడికి జట్టు ఇచ్చే గొప్ప కానుక అంతకంటే మరొకటి ఉండదు’’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment