భారత సంచలన పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఈ యువ స్పీడ్‌స్టర్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దేశవాళీ క్రికెట్‌లో ఢిల్లీకి ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
మెరుపు వేగంతో దూసుకువచ్చే బంతులు విసరడంలో దిట్ట
లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ రైటార్మ్ బౌలర్.. తన మెరుపు వేగంతో హాట్‌టాపిక్‌గా మారాడు. గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతూ యువ బౌలర్లందరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. లక్నో తరఫున వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
మ్యాచ్ ఫిట్‌నెస్ కూడా సాధించాడు!
అయితే, ఆ వెంటనే గాయం కారణంగా మయాంక్ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న అతడు.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి చేరాడు. అక్కడి వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందిన 22 ఏళ్ల మయాంక్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. మ్యాచ్ ఫిట్‌నెస్ కూడా సాధించాడు.
టీమిండియా సెలక్టర్ల ఆరా
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘గత నెల రోజులుగా మయాంక్ గాయం కారణంగా ఎలాంటి ఇబ్బందిపడలేదు. ఎన్సీఏ నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ చేశాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రానికి సిద్ధంగా ఉన్నాడా? లేదా? అని టీమిండియా సెలక్టర్లు ఆరా తీశారు.
స్వదేశంలో వరుస టెస్టు సిరీస్‌లు ఉన్న కారణంగా.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ సందర్భంగా ఎక్కువగా కొత్త ముఖాలకే చోటు ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. మయాంక్ ఇక్కడ రోజుకు 20 ఓవర్ల పాటు వైట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఎన్సీఏలో అతడి ప్రదర్శన చూసిన తర్వాత.. టీమిండియా సెలక్టర్లు అతడి బంగ్లాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తారనే నమ్మకం బలపడింది. ఎన్సీఏ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం కోసం టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అగార్కర్ బెంగళూరుకు రానున్నాడు. అప్పుడు ఈ విషయంపై స్పష్టత వస్తుంది.
గంభీర్, మోర్కెల్‌లకు తెలుసు
అయినా.. మయాంక్‌ను కేవలం టీ20 ఫార్మాట్‌కే పరిమితం చేయాలని సెలక్టర్లు భావించడం లేదు. టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఉన్న సమయంలో మయాంక్‌ను దగ్గరగా గమనించారు. అతడి ప్రతిభ గురించి వారికి తెలుసు’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించాయి. దీనిని బట్టి బంగ్లాదేశ్‌తో అక్టోబరు 6-12 మధ్య జరుగనున్న టీ20 సిరీస్‌కు మయాంక్ యాదవ్ ఎంపిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.
చదవండి: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. మట్టికరిచిన ఆసీస్
Comments
Please login to add a commentAdd a comment