తాను టీమిండియాకు ఎంపికవుతానని ఊహించలేదన్నాడు యువ బౌలర్ మయాంక్ యాదవ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వెబ్‌సైట్ చూసిన తర్వాతే తనకు నమ్మకం కుదిరిందన్నాడు. ఆ తర్వాత తనను అభినందిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఆ సమయంలో ఒక్కసారిగా గతం కళ్ల ముందు కదలాడిందని ఉద్వేగానికి లోనయ్యాడు.
లక్నోకు ఆడిన మయాంక్
టీమిండియా ప్రస్తుత హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ గతంలో చెప్పిన మాటలు తనపై ప్రభావం చూపాయని మయాంక్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. కాగా ఢిల్లీకి చెందిన మయాంక్.. 2024లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడిన ఈ పేస్ బౌలర్.. గంటకు 150కి పైగాకిలో మీటర్ల వేగంతో బంతులు విసిరి క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు.
స్పీడ్‌కు గాయాల బ్రేక్
వరుసగా రెండు మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించి.. పేస్ స్టన్ గన్‌గా ప్రశంసలు అందుకున్నాడు. అయితే, గాయం కారణంగా అతడి స్పీడ్‌కు బ్రేక్ పడింది. పక్కటెముకల నొప్పితో మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరమయ్యాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందిన మయాంక్ యాదవ్ ఇటీవలే మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాడు. నెట్స్‌లో అతడి బౌలింగ్ పట్ల సంతృప్తివ్యక్తం చేసిన టీమిండియా సెలక్టర్లు బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు మయాంక్‌ను ఎంపిక చేశారు.
గంభీర్ భయ్యా ఆరోజు నాతో చెప్పాడు
ఈ నేపథ్యంలో మయాంక్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘‘కొంత మంది ఆటగాళ్లు వరుసగా విఫలమైనా.. తమను తాము నిరూపించుకోవడానికి వరుస అవకాశాలు వస్తాయి.. కానీ కొంతమందికి మాత్రం ఎప్పుడో ఒకసారి ఒక్క ఛాన్స్ మాత్రమే వస్తుంది’ అని గౌతం గంభీర్ భయ్యా ఓసారి నాతో చెప్పాడు. నిజానికి నన్ను ఓ ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసిన తర్వాత కూడా షూ స్పాన్సర్ కోసం వెతుక్కోవాల్సిన దుస్థితిలో ఉన్న రోజులవి..
నన్ను నేను నిరూపించుకున్నాను
ఆ సమయంలో గౌతం భయ్యా మాటలో నా మనసులో అలాగే ఉండిపోయాయి. ఆయనతో పాటు విజయ్ దహియా(లక్నో మాజీ కోచ్) కూడా.. కనీసం రెండేళ్ల తర్వాతైనా నువ్వు మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడతావు. అప్పటి వరకు ఓపికగా వేచిచూడు అని చెప్పారు. ఈ ఏడాది ఆ అవకాశం వచ్చింది. నన్ను నేను నిరూపించుకున్నాను.
ఇక నేను టీమిండియాకు ఎంపికయ్యాననే విషయం కాస్త ఆలస్యంగానే తెలిసింది. ఎన్సీఏలో నా సహచర ఆటగాళ్లకు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ కాల్స్ వచ్చాయి. అప్పుడు నేను బీసీసీఐ అధికారిక వెబ్‌సైట్ చూస్తే టీ20 జట్టులో నా పేరు కూడా కనిపించింది. అప్పుడు ఒక్కసారిగా గతం గుర్తుకు వచ్చింది.
అరంగేట్రం ఖాయమే!
వరుస గాయాలతో సతమతమవుతూ నేను ఎన్సీఏకు చేరడం.. నాలుగు నెలలు అక్కడే ఇప్పుడిలా జట్టుకు ఎంపిక కావడం.. అన్నీ గుర్తుకువచ్చాయి’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా 22 ఏళ్ల మయాంక్ స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడం దాదాపు ఖాయమైనట్లే!
లక్నో సూపర్ జెయింట్స్ మాజీ మెంటార్ గంభీర్, మాజీ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌లకు మయాంక్ నైపుణ్యాల గురించి అవగాహన ఉంది. వీరిద్దరిలో ఒకరు ఇప్పుడు టీమిండియా హెడ్‌కోచ్, మరొకరు బౌలింగ్ కోచ్ అన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment