వ్యూహాలు రచించడంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఎవరూ సాటిరారని భారత బ్యాటింగ్ మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు. హిట్‌మ్యాన్ చిన్న చిన్న విషయాలను మర్చిపోవచ్చేమో గానీ.. గేమ్‌ప్లాన్ అమలు చేయడంలో మాత్రం పక్కాగా ఉంటాడని పేర్కొన్నాడు. జట్టులోని ఆటగాళ్ల అభిప్రాయాలకు విలువనిచ్చే అతి కొద్దిమంది కెప్టెన్లలో రోహిత్ ముందు వరుసలో ఉంటాడని ప్రశంసించాడు.
కాగా రోహిత్ శర్మకు మతిమరుపు ఎక్కువని అభిమానులు జోకులు వేసుకుంటారన్న సంగతి తెలిసిందే. అతడి సహచర ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన సరదా వ్యాఖ్యలే ఇందుకు కారణం. గతంలో ఓ షోలో కోహ్లి మాట్లాడుతూ.. ‘‘రోహిత్ విదేశీ పర్యటనల్లో ఉన్నపుడు ఐపాడ్, ఫోన్, పాస్‌వర్డ్స్ వంటివి మర్చిపోతాడని.. అతడి వస్తువుల కోసం టీమ్ బస్ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది’’ అని తెలిపాడు.
ఇందుకు తోడు అప్పుడప్పుడు టాస్ సమయంలోనూ రోహిత్ తడబాటుకు గురవటాన్ని ప్రస్తావిస్తూ నెట్టింట ఇటీవలి కాలంలో జోకులు బాగా పేలుతున్నాయి. ఈ విషయం గురించి విక్రమ్ రాథోడ్ స్పందిస్తూ.. ‘‘రోహిత్.. ఫోన్, ఐప్యాడ్ మర్చిపోవడం.. టాస్ సమయంలో బ్యాటింగా?, బౌలింగా?.. ఎంచుకోవడంలో తడబడటం జరుగుతుందేమో గానీ.. గేమ్‌ప్లాన్‌ను మాత్రం ఎప్పుడూ మర్చిపోడు.
అతడు గొప్ప వ్యూహకర్త. అద్భుతమైన బ్యాటర్. నాకు తెలిసి.. రోహిత్ కంటే గేమ్‌ను అంతబాగా అర్థం చేసుకునే వారు మరొకరు ఉండరు. ఎలా ఆడాలన్న అంశంపై రోహిత్‌కు స్పష్టత ఉంటుంది. జట్టులోని ఆటగాళ్ల అందరి అభిప్రాయాలను గౌరవిస్తాడు.
ముఖ్యంగా ఎవరి నైపుణ్యాలు, సామర్థ్యాలు ఏమిటో.. వాటిని ఓ మ్యాచ్‌లో ఎలా ఉపయోగించుకోవాలోనన్న చర్చలకై ఎక్కువ సమయం కేటాయిస్తాడు. బౌలర్లు, బ్యాటర్ల మీటింగ్‌లో కచ్చితంగా భాగమవుతాడు. వాళ్ల మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కెప్టెన్‌గా అతడు సూపర్’’ అని రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. కాగా తరువార్ కోహ్లి పాడ్‌కాస్ట్‌లో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు విక్రమ్ రాథోడ్.
Comments
Please login to add a commentAdd a comment