![Mumbai Indians Should Sack Hardik Pandya: Aakash Chopras Post Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/28/pandya.gif.webp?itok=IaAAgiPE)
PC:IPL.com
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఏకంగా 277 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరోసారి తన వ్యూహాలను అమల చేయడంలో విఫలమయ్యాడు. బౌలర్లను సరిగ్గా ఉపయోగించడంలో పాండ్యా చేతులేత్తేశాడు. ఆ జట్టు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను సద్వినియోగం చేసుకోవడంలో హార్దిక్ ఇబ్బంది పడుతున్నాడు. తొలి 10 ఓవర్లలో బుమ్రాతో హార్దిక్ కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశాడు.
నాలుగో ఓవర్ వేసిన బుమ్రా.. మళ్లీ 13 ఓవర్‌లో ఎటాక్‌లోకి వచ్చాడు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిషేక్, ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచరీలు సాధించారు. దీంతో హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సైతం హార్దిక్ పాండ్యాపై సీరియస్ అయినట్లు ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. "ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇటువంటి చెత్త కెప్టెన్సీని నేను చూడలేదు. హార్దిక్ పాండ్యా తన సారథ్యాన్ని వదిలేయాలి. లేకపోతే ముంబై ఫ్రాంచైజీ అయినా అతడి తొలగించాలి’ అంటూ జియో సినిమా షోలో చోప్రా పేర్కొన్నట్లు ఓ నెటిజన్ ట్విట్ చేశాడు.
తాజాగా ఇదే విషయంపై చోప్రా క్లారిటీ ఇచ్చాడు. తను అటువంటి వ్యాఖ్యలు ఏమీ చేయలేదని, అవన్నీ రూమర్సే అని చోప్రా చెప్పుకొచ్చాడు. "అసలు ఏమి జరుగుతుందో నాకు అర్దం కావడం లేదు. మీకేం అయింది? అబద్ధాలను ప్రచారం చేయొద్దు బ్రదర్. మీ స్టేట్‌మెంట్ తప్పు. అలాగే నా పేరును ప్రస్తావించారు. కానీ, నా పేరులోనూ అక్షర దోషాలు ఉన్నాయి" అంటూ ఓ యూజర్ ట్వీట్‌కు చోప్రా రిప్లే ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment