బంగ్లాదేశ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్ నజ్ముల్ హొసేన్ షాంటో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ అనంతరం షాంటో కెప్టెన్సీ నుంచి వైదొలుగుతాడని సమాచారం. ఈ విషయాన్ని షాంటో ఇదివరకే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం బీసీబీ అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ విదేశాల్లో ఉన్నందున ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షాంటోను ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్‌గా నియమించారు. షాంటో ఏడాది పాటు కెప్టెన్‌గా కొనసాగుతాడని అప్పట్లో బీసీబీ వెల్లడించింది.
అయితే షాంటో ఏడాది కూడా పూర్తి కాకుండానే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. షాంటో 2024 టీ20 వరల్డ్‌కప్ అనంతరమే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని అనుకున్నాడు. అయితే అప్పట్లో అది కుదరలేదు. షాంటో కెప్టెన్సీ నుంచి వైదొలిగాక మెహిది హసన్ మిరాజ్ టెస్ట్, వన్డేలకు.. తౌహిద్ హ్రిదోయ్ టీ20లకు కెప్టెన్లుగా ఎంపిక కావచ్చు.
షాంటో బంగ్లాదేశ్‌ను తొమ్మిది టెస్ట్‌ల్లో (మూడు విజయాలు, ఆరు పరాజయాలు), తొమ్మిది వన్డేల్లో (మూడు విజయాలు, ఆరు పరాజయాలు), 24 టీ20ల్లో (10 విజయాలు, 14 పరాజయాలు) ముందుండి నడిపించాడు. షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్ ఇటీవల పాక్‌పై టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment