చెంప చెళ్లుమనిపించేలా!.. కన్నీళ్లు కావు అవి! | Olympics 2024 Unreal: Neeraj Chopra Message For Vinesh Phogat Netizens Lauds Her, Check Out The Details | Sakshi
Sakshi News home page

చెంప చెళ్లుమనిపించేలా!.. నమ్మలేకపోతున్నా!

Published Tue, Aug 6 2024 7:06 PM | Last Updated on Tue, Aug 6 2024 7:57 PM

Olympics 2024 Unreal: Neeraj Chopra Message For Vinesh Phogat Netizens Lauds Her

బహుశా.. ఏడాది గడిచిందేమో!.. జీవితంలోనే అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొందామె. ఢిల్లీ వీధుల్లో రోజుల తరబడి సహచర మహిళా రెజ్లర్లతో కలిసి పోలీసు దెబ్బలు తినే దుస్థితిలో పడింది. ఆపై అరెస్టయింది కూడా! అంతటితో ఆమె కష్టాలు ఆగిపోలేదు.. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ వేధింపులు..

అన్యాయాన్ని ఎదిరించే క్రమంలో జీవిత కాలపు శ్రమతో సాధించిన ఖేల్‌రత్నలాంటి అవార్డులు వెనక్కి ఇచ్చేసినా.. పెదవి విరుపులే.. అంతేనా.. ‘ఇంతకు తెగిస్తారా’ అనే విపరీతపు మాటలు.. సాధించిన పతకాలన్నింటినీ గంగానదిపాలు చేసేందుకు సిద్ధపడినా పోరాటంలోని తీవ్రతను గుర్తించలేని అజ్ఞానం..

‘‘ఇక్కడితో నీ కెరీర్‌, ఖేల్‌ ఖతం.. రిటైర్మెంట్ ప్రకటించడమే శరణ్యం.. ఆట మీద కాకుండా ఇలాంటి విషయాలపై దృష్టి పెడితే నీకే తలపోట్లు’’.. అంటూ విద్వేషకారులు విషం చిమ్ముతున్నా.. ఆమె వెనుకడుగు వేయలేదు. సహచరులకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నిస్తూ..  తప్పు చేసిన వారి ఉనికి ప్రశ్నార్థకం చేయాలనే పట్టుదలతో ముందుకు సాగింది. 

‘‘కాస్తైనా కనికరం లేదా’’ అంటూ విద్వేష విషం చిమ్ముతున్న వాళ్లకు ధీటుగా బదులిస్తూనే.. అన్యాయం చేసిన వాళ్లు దర్జాగా గల్లా ఎగురవేసుకుని తిరుగుతూ ఉంటే.. చూడలేక కన్నీటి పర్యంతమైంది కూడా! అవును.. ఆమె మరెవరో కాదు.. ఆటలోనే కాదు జీవితంలోనూ ఎన్నో సవాళ్లు.. మరెన్నో మలుపులు ఎదుర్కొన్న పట్టువదలని ధీర వనిత, హర్యానా శివంగి వినేశ్‌ ఫొగట్‌. 

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న ఒకప్పటి బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను గద్దె దించేందుకు చేసిన అలుపెరగని పోరాటం ఆమె కెరీర్‌ను చిక్కుల్లో పడేసింది.

భారత తొలి మహిళ రెజ్లర్‌గా చరిత్ర
అయినా.. ‘పట్టు’ వీడలేదు ఈ స్టార్‌ రెజ్లర్‌. గాయాల రూపంలో దెబ్బ మీద దెబ్బపడినా ఆత్మవిశ్వాసం చెక్కు చెదరనీయక పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వరుసగా మూడోసారి ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళ రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది ఈ హర్యానా అమ్మాయి. 

భారీ అంచనాలు లేకుండా బరిలోకి దిగడం ఆమెకు మేలే చేసింది. మహిళల 50 కేజీల విభాగంలో తలపడిన వినేశ్‌ ప్రయాణం.. ప్రిక్వార్టర్స్‌ వరకు సాధారణంగానే సాగింది. అయితే, అక్కడే ఆమె సత్తాకు అసలు సిసలు పరీక్ష ఎదురైంది. జపాన్‌ రెజ్లర్‌, వరల్డ్‌ నంబర్‌ వన్‌, టోక్యో స్వర్ణ పతక విజేత యీ సుసాకీ రూపంలో కఠినమైన సవాలు ముందు నిలిచింది. 

వరల్డ్‌ నంబర్‌ వన్‌కు షాకిచ్చి..
అయితే, ఆద్యంతం ఉత్కంఠ రేపిన వీరిద్దరి పోరు ముగిసే సెకండ్ల వ్యవధిలో తిరిగి పుంజుకున్న వినేశ్‌ ఫొగట్‌ 3-2తో సుసాకీని ఓడించి.. సంచలన విజయం అందుకుంది. తద్వారా తన కెరీర్‌లో మరోసారి విశ్వ క్రీడల్లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ ఉక్రెయిన్‌కు చెందిన, ఎనిమిదో సీడ్‌ ఒక్సానా లివాచ్‌తో వరల్డ్‌ నంబర్‌ 65 వినేశ్‌ ఫొగట్‌ తలపడింది. 

వినేశ్‌ శుభారంభం అందుకున్నా.. లివాచ్‌ ఉడుం పట్టు వల్ల.. ఆఖరి వరకు బౌట్‌ ఉత్కంఠగా సాగింది. అయితే, ‍ప్రపంచ నంబర్‌ వన్‌నే ఓడించిన వినేశ్‌ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో లివాచ్‌ పని పట్టి 7-5తో ఆమెను ఓడించింది. ఫలితంగా తన కెరీర్‌లో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్‌లో సెమీస్‌ పోరుకు అర్హత సాధించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్రకెక్కింది. 

చెంప చెళ్లుమనేలా
న్యాయం కోసం పోరాడిన తాను.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే క్రమంలో... జూనియర్‌ చేతిలో ఓడితే.. ‘‘ఇక నీ ఆట కట్టు’’ అని హేళన చేసిన వారికి చెంప చెళ్లుమనేలా.. సమాధానమిచ్చింది. తీవ్ర భావోద్వేగానికి లోనై..  కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ క్రమంలో వినేశ్‌ ఫొగట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌ గోల్డెన్‌ బాయ్‌, ప్యారిస్‌లో ఫైనల్‌ చేరిన భారత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా కూడా వినేశ్‌ ఫొగట్‌ను కొనియాడాడు.

అసాధారణం.. నమ్మలేకపోతున్నా
‘‘అసాధారణ విజయం. వరల్డ్‌నంబర్‌ వన్‌ సుసాకీని వినేశ్‌ ఓడించడం నమ్మశక్యంకాని విషయం. ఇక్కడిదాకా చేరేందుకు ఆమె ఎంతగా శ్రమిందో ఈ విజయం ద్వారా తెలిసిపోతుంది. ఎన్నో కష్టాలు చవిచూసింది. తను పతకం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని నీరజ్‌ చోప్రా వినేశ్‌ ఆట తీరును ఆకాశానికెత్తాడు.

చదవండి: Olympics 2024: ఫైనల్లో నీరజ్‌ చోప్రా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement