'Pakistan Much Stable for Asia Cup': Pak Player Sensational Claim, Says Team India Destroyed - Sakshi
Sakshi News home page

WC 2023: టీమిండియాను భ్రష్టు పట్టిస్తున్నారు.. వీళ్ల కంటే పాక్‌ నయం: మాజీ క్రికెటర్‌ ఓవరాక్షన్‌

Published Sat, Aug 12 2023 3:13 PM | Last Updated on Tue, Oct 3 2023 6:26 PM

Pakistan Much Stable for Asia Cup: Pak Player Sensational Claim Team India Destroyed - Sakshi

World Cup 2023- Asia Cup 2023: టీమిండియాను ఉద్దేశించి పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ నవాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మెగా ఈవెంట్ల నేపథ్యంలో పిచ్చి ప్రయోగాలు చేస్తూ.. జట్టును భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాతో పోలిస్తే.. ప్రస్తుతం పాకిస్తాన్‌ పటిష్టంగా కనిపిస్తోందంటూ ప్రగల్బాలు పలికాడు.

విండీస్‌తో ప్రయోగాలు
కాగా ఆగష్టు 30 నుంచి ఆసియా వన్డే కప్‌ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. శ్రీలంక, పాకిస్తాన్‌లలో నిర్వహించనున్న ఈ టోర్నీకి పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఇప్పటికే జట్టును ప్రకటించింది. అయితే, ఈ ఈవెంట్‌కు ముందు వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో తలపడింది టీమిండియా.

ఘోర పరాభవం
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి రెండు వన్డేల్లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిలను పక్కన పెట్టిన మేనేజ్‌మెంట్‌.. యువకులకు అవకాశం ఇచ్చింది. అయితే, కష్టమ్మీద తొలి మ్యాచ్‌ గెలిచిన భారత జట్టు.. రెండో వన్డేలో ఓటమిపాలైంది. సమిష్టి వైఫల్యంతో ఘోర పరాభవం మూటగట్టుకుంది.

ఘన విజయం
అయితే, మూడో వన్డేలో ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌(77), శుబ్‌మన్‌ గిల్‌(85) సహా సంజూ శాంసన్‌(51), హార్దిక్‌ పాండ్యా(70- నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించడంతో 200 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కానీ.. ఆసియా కప్‌ వంటి కీలక ఈవెంట్‌కు ఇలాంటి ప్రయోగాలు ఎందుకనే విమర్శలు వచ్చాయి. 

భ్రష్టు పట్టిస్తున్నారు
ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ ప్లేయర్‌ సర్ఫరాజ్‌ నవాజ్‌ స్పందిస్తూ.. ‘‘ఆసియా కప్‌, ప్రపంచకప్‌ ఈవెంట్లకు టీమిండియాతో పోలిస్తే పాకిస్తాన్‌ పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ మెగా ఈవెంట్లకు సరైన కాంబినేషన్‌ను కూడా సెట్‌ చేయలేకపోయింది.

తరచూ కెప్టెన్లను మారుస్తున్నారు. కొత్త వాళ్లతో ప్రయోగాలు చేస్తున్నారు. అయినా ఇప్పటికీ జట్టు కూర్పుపై అవగాహనకు రాలేకపోయారు. ఇవన్నీ చూస్తుంటే... భారత క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి బదులు నాశనం చేస్తున్నారనిపిస్తోంది’’ అని మేనేజ్‌మెంట్‌ నిర్ణయాలను తప్పుబట్టాడు.

ఓవరాక్షన్‌ వద్దు
ఇక సొంతగడ్డపై ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీ ఆడటం కచ్చితంగా ఒత్తిడిని పెంచుతుందని.. అయితే, జట్టులో సీనియర్‌ స్టార్లు ఉండటం టీమిండియాకు కలిసి వస్తుందని సర్ఫరాజ్‌ నవాజ్‌ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో టీమిండియా ఫ్యాన్స్‌.. ‘‘ముందు మీ జట్టు సంగతి చూసుకోండి. మా టీమ్‌ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓవరాక్షన్‌ వద్దు’’ అంటూ నవాజ్‌కు కౌంటర్లు వేస్తున్నారు.  

కాగా ఆసియా కప్‌ నేపథ్యంలో సెప్టెంబరు 2, వరల్డ్‌కప్‌ ఈవెంట్‌లో అక్టోబరు 14న భారత్‌- పాక్‌ తలపడనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు ప్రస్తుతం విండీస్‌తో టీ20 సిరీస్‌లో బిజీగా ఉంది.

చదవండి: ఆసియాకప్‌కు బంగ్లా జట్టు ప్రకటన.. యువ సంచలనం ఎంట్రీ! స్టార్‌ ఆటగాడిపై వేటు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement