
క్వింటన్ డికాక్, సదరన్ బ్రేవ్
సౌతాంప్టన్: హండ్రెడ్ మెన్స్ బాల్ కాంపిటీషన్‌లో భాగంగా శనివారం సౌతాంప్టన్ వేదికగా నార్తన్ సూపర్‌చార్జర్స్, సదరన్ బ్రేవ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ ఆటగాడు క్వింటన్ డికాక్ బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు నిలిచి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. (45 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 72 నాటౌట్) పరుగులు చేసిన డికాక్ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే విజాయాన్ని అందించాడు. తన సహచరులంతా తక్కువ స్కోరుకే వెనుదిరుగుతున్నా డికాక్ మాత్రం ఎక్కడా రన్‌రేట్ తగ్గకుండా బౌండరీల వర్షం కురిపించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్‌చార్జర్స్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. డేన్ విలాస్ 35 పరుగులతో టాప్ స్కోరరగా నిలవగా.. క్రిస్ లిన్ 26, విల్లీ 24 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 95 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంతో సదరన్ బ్రేవ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. అయితే వారి రన్‌రేట్ మైనస్‌లో ఉన్నప్పటికీ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు.. రెండు ఓటములతో నిలిచి టాప్ 2కు చేరింది.