
న్యూఢిల్లీ: పొట్టి ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో భారత హెడ్ కోచ్‌గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి అనంతరం పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తన మొదటి ఛాయిస్ అని పేర్కొన్నాడు. అనుభవం దృష్ట్యా రోహిత్ అయితేనే టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించగలడని అభిప్రాయపడ్డాడు. కోహ్లి వారసుడిగా కేఎల్ రాహుల్ తన రెండో ప్రాధాన్యత అని తెలిపాడు.
కాగా, టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరనే అంశంపై గత కొద్ది రోజులుగా అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ద్రవిడ్ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. కోచ్‌గా బాధ్యతలు చేపట్టక మునుపే ద్రవిడ్.. కోహ్లిపై వ్యతిరేకతను చాటుకుంటున్నాడంటూ నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.
మరికొందరైతే కోహ్లి సారధ్య బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ద్రవిడే కారణమంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కోహ్లి టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతానన్న ప్రకటన తర్వాతే ద్రవిడ్ కోచ్ పదవి చేపట్టేందుకు ఒప్పుకోవడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. కాగా, స్వదేశంలో నవంబర్ 17న ప్రారంభంకానున్న న్యూజిలాండ్ సిరీస్ నుంచి ద్రవిడ్ టీమిండియా కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు బీసీసీఐ నవంబర్ 3న ప్రకటించింది.
చదవండి: చరిత్ర సృష్టించిన ఉన్ముక్త్ చంద్.. ఆ లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు