తమిళనాడు రంజీ జట్టు కెప్టెన్ సాయికిషోర్ రికార్డు పుటల్లోకెక్కాడు. ముంబైతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 6 వికెట్లు తీయడం ద్వారా ప్రస్తుత సీజన్‌లో తన వికెట్ల సంఖ్యను 52 పెంచుకున్నాడు. తద్వారా ఓ రంజీ సీజన్‌లో 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో తమిళ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అలాగే ప్రస్తుత సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సాయికిషోర్ తర్వాత అజిత్ రామ్ (41), ధరేంద్ర సిన్హ్ జడేజా (41), హితేశ్ వాలుంజ్ (41), గౌరవ్ యాదవ్ (41) ఉన్నారు.
ఇదిలా ఉంటే, ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో తమిళనాడు తడబాటుకు గురైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న తమిళనాడు.. ముంబై బౌలర్లు సంయుక్తంగా రాణించడంతో 146 పరుగులకే కుప్పకూలింది. తుషార్ దేశ్ పాండే 3, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్ తలో 2 వికెట్లు, మోహిత అవస్థి ఓ వికెట్ పడగొట్టారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో విజయ్ శంకర్ (44), వాషింగ్టన్ సుందర్ కాస్త పర్వాలేదనిపించగా.. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై... శార్దూల్ ఠాకూర్ (82 నాటౌట్), ముషీర్ ఖాన్ (55) రాణించడంతో రెండో రోజు మూడో సెషన్ సమయానికి 8 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. హార్దిక్ తామోర్ (35) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. శార్దూల్‌కు జతగా నుశ్ కోటియన్ (20) క్రీజ్‌లో ఉన్నాడు. సాయికిషోర్ (6/79) ముంబైని ముప్పుతిప్పలు పెట్టాడు. సందీప్ వారియర్, కుల్దీప్ సేన్ తలో వికెట్ దక్కించకున్నారు. ప్రస్తుతం ముంబై 108 పరుగుల లీడ్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment