దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకోవాలనుకున్న భారత జట్టుకు మరోసారి నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన టీమిండియా.. రెండో టెస్టులో తిరిగి పుంజుకుంది. కేప్‌టౌన్ వేదికగా ప్రోటీస్‌తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1 సమం రోహిత్ సేన చేసింది.
ఏదేమైనప్పటికీ సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ మరోసారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అయితే తొలి టెస్టులో ఓటమి అనంతరం టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఘాటు విమర్శలు చేశాడు. గత పదేళ్లలో భారత జట్టు అసలేం సాధించలేదని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అతడి వ్యాఖ్యలకు భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గట్టి కౌంటరిచ్చాడు. వాన్ కామెంట్స్ తనకు నవ్వు వచ్చేలా చేశాయి అంటూ అశ్విన్ అన్నాడు.
"భారత జట్టు గత పదేళ్లలో ఏమి సాధించలేదని తొలి టెస్టు ఓటమి తర్వాత వాన్ కామెంట్స్ చేశాడు. అవును నిజంగానే మేము గత కొన్ని ఏళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీలను గెలవలేకపోయాం. కానీ వరల్డ్‌క్రికెట్‌లో మా జట్టు బలమైన జట్టు. టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ జట్లలో మా టీమ్ ఒకటి. గత కొంతకాలంగా రెడ్ బాల్ క్రికెట్‌లో అద్బుతమైన విజయాలను సాధించాము. అతడు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంతమంది భారత క్రికెట్ నిపుణులు సైతం సొంత జట్టుపై ఈ తరహా విమర్శలు చేశారు.
నిజం చెప్పాలంటే వారు కామెంట్స్ చేసినప్పుడు నాకు నవ్వు వచ్చింది. ఎందుకంటే వారికి వారే ఆలోచించుకోవాలి. కేప్‌టౌన్ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌటైంది. అదే తొలి టెస్టులో ఒక వేళ దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసి ఉంటే 65 పరుగులకే ఆలౌట్ అయ్యే అవకాశం లేదా? టీమిండియా కూడా ఆరంభంలో ఇబ్బంది పడింది. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. విరాట్, శ్రేయస్ జట్టును అదుకున్నారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కీలక శతకంతో రాణించాడు.
చివరికి మేం 245 పరుగులు చేశాం. కాబట్టి టెస్ట్ క్రికెట్‌కు మిగితా ఫార్మాట్‌లకు చాలా తేడా ఉంది. మంచి, చెడూ రెండు వుంటాయి. భారత్ వంటి దేశంలో క్రికెట్‌ను ఒక మతంగా పరిగణిస్తారు. అందుకేనేమో మేం ఎక్కువగా విమర్శలకు గురవుతుంటామని" అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment