![Ricky Ponting Names 2 Key Players For Australia Ahead Of WC 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/4/Warner.jpg.webp?itok=pfINKoNG)
టీమిండియాతో వన్డే సిరీస్ గెలిచిన ఆసీస్ జట్టు
ICC World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023 నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ మెగా టోర్నీలో ఆసీస్‌కు ఇద్దరు బౌలర్లు కీలకంగా మారనున్నారని పేర్కొన్నాడు. వారిద్దరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిస్తే కంగారు జట్టు ఆరోసారి వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
కాగా 1987, 1999, 2003, 2007, 2015లో ఆస్ట్రేలియా జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్ ఈసారి కూడా వన్డే ప్రపంచకప్-2023కు నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.
వాళ్లిద్దరు విజృంభిస్తే
ఈ నేపథ్యంలో భారత్ వేదికగా అక్టోబరులో మొదలుకానున్న మెగా ఈవెంట్‌కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఐసీసీ రివ్యూ షోలో మాట్లాడిన రిక్కీ పాంటింగ్.. పేసర్ మిచెల్ స్టార్క్, లెగ్ స్పిన్నర్ ఆడం జంపా విజృంభిస్తే ఈసారి ఆసీస్‌కు తిరుగు ఉండదని ధీమా వ్యక్తం చేశాడు. వీరిద్దరు చెలరేగితే టైటిల్ గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నాడు.
‘‘మిచెల్ స్టార్క్ .. ఆరడుగుల ఐదు అంగుళాల ఎత్తు.. లెఫ్టార్మర్.. గంటకు సుమారు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. అతడు ఫామ్‌లో ఉంటే ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే! పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గణాంకాలు చూస్తే స్టార్క్ సత్తా ఏమిటో అర్థమవుతుంది.
ట్రంప్ కార్డ్ అతడే
ఇక ఆడం జంపా. స్టార్క్‌తో పాటు జంపా కూడా గత నాలుగైదేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక బౌలర్‌గా ఎదుగుతున్నాడు. ఆసీస్ బౌలింగ్ విభాగానికి వెన్నెముకలా మారాడు. ఇటీవల టీమిండియాతో సిరీస్‌లో అతడు లేని లోటు కనిపించింది. లెగ్ స్పిన్నర్ జంపా రానున్న వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాకు ట్రంప్ కార్డ్‌గా మారనున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
కాగా 2015 ప్రపంచకప్ టోర్నీలో స్టార్క్ 8 మ్యాచ్‌లలో 22 వికెట్లు పడగొట్టి ఆసీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గత రెండు పర్యాయాల్లో ఆసీస్ తరఫున ఈ ఐసీసీ ఈవెంట్‌లో లీడ్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఇక జంపా.. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే రిక్కీ పాంటింగ్ ప్రస్తుతం ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా బిజీబిజీగా ఉన్నాడు.
చదవండి: CSK Vs LSG: చెత్త బౌలింగ్.. పేసర్లకు ధోని స్ట్రాంగ్ వార్నింగ్! ఇలాగే కొనసాగితే
సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు
Comments
Please login to add a commentAdd a comment