ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టిన రింకూ.. మ్యాచ్‌ గెలిచాం, కానీ..! | Rinku Singh Last Ball Six VS Australia In 1st T20 Thriller Not Counted, Know Why And Video Goes Viral - Sakshi
Sakshi News home page

IND VS AUS 1st T20: ఆఖరి బంతికి సిక్సర్‌ కొట్టిన రింకూ.. మ్యాచ్‌ గెలిచాం, కానీ..!

Published Fri, Nov 24 2023 11:31 AM | Last Updated on Fri, Nov 24 2023 12:12 PM

Rinku Singh Last Ball Six VS Australia In 1st T20 Thriller Not Counted - Sakshi

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా ఆసీస్‌తో నిన్న (నవంబర్‌ 23) జరిగిన తొలి టీ20లో టీమిండియా 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో ఆసీస్‌ నిర్ధేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ఆఖరి బంతి​కి ఛేదించింది. సీన్‌ అబాట్‌ బౌలింగ్‌లో రింకూ సింగ్‌ ఆఖరి బంతికి సిక్సర్‌ బాదాడు.

అయితే రింకూ ఈ సిక్సర్‌ కొట్టినందుకు టీమిండియా గెలవలేదు. భారత్‌ గెలుపుకు ఆఖరి బంతికి సింగిల్‌ అవసరం కాగా.. అబాట్‌ నో బాల్‌ వేశాడు. అంపైర్లు రింకూ సిక్సర్‌ను పరిగణలోకి తీసుకోకుండా నో బాల్‌ ద్వారా లభించిన పరుగుతోనే టీమిండియా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో రింకూ సింగ్‌ సిక్సర్‌ వృధా అయ్యింది. 

కాగా, ఛేదనలో అప్పటిదాకా సాఫీగా సాగిన టీమిండియా ప్రయాణం ఆఖరి ఓవర్లో కీలక మలుపులు తిరిగింది. చివరి ఓవర్‌లో భారత్‌ గెలుపుకు 7 పరుగులు మాత్రమే అవసరం కాగా.. రింకూ సింగ్‌ తొలి బంతికే బౌండరీ బాది భారత్‌ను గెలుపు వాకిటికి చేర్చాడు. అనంతరం రెండో బంతికి బైస్‌ రూపంలో మరో పరుగు వచ్చింది. దీంతో భారత్‌ గెలుపుకు మరింత చేరువగా వెళ్లింది. ఇక భారత్‌ గెలవాలంటే 4 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేయాలి.

ఇక్కడే మ్యాచ్‌ మలుపులు తిరిగింది. మూడు (అక్షర్‌ క్యాచ్‌ ఔట్‌), నాలుగు (బిష్ణోయ్‌ రనౌట్‌), ఐదు బంతులకు (అర్షదీప్‌) భారత్‌ వికెట్లు కోల్పోయింది. ఐదో బంతికి అర్షదీప్‌ రెండో పరుగుకు వెళ్తూ రనౌటయ్యాడు. దీంతో భారత్‌ గెలవాలంటే ఆఖరి బంతికి ఒక్క పరుగు చేయాల్సి వచ్చింది. స్ట్రయిక్‌లో ఉన్న రింకూ సింగ్‌ అబాట్‌ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచాడు. మ్యాచ్‌ చూస్తున్నవారంతా రింకూ సిక్సర్‌ కారణంగానే భారత్‌ గెలిచినందని అనున్నారు. కానీ, అబాట్‌ ఆఖరి బంతి క్రీజ్‌ దాటి బౌలింగ్‌ చేయడంతో భారత్‌ ఖాతాలోని పరుగు చేరి శ్రమ లేకుండానే టీమిండియాకు విజయం దక్కింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. జోష్‌ ఇంగ్లిస్‌ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. స్టీవ్‌ స్మిత్‌ (52) అర్ధసెంచరీతో రాణించాడు. 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. సూర్యకుమార్‌ యాదవ్‌ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్‌ (14 బంతుల్లో 22 నాటౌట్‌; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభించడంతో ఆఖరి బంతికి విజయం సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement