ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖ వేదికగా టీమిండియాతో నిన్న (నవంబర్ 23) జరిగిన తొలి టీ20లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ భారీ స్కోర్ సాధించినప్పటికీ.. సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 80; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 58; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), రింకూ సింగ్ (14 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌ను గెలిపించారు. చివరి ఓవర్‌లో భారత్ 3 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనిపించినప్పటికీ.. రింకూ సింగ్ చివరి బంతికి సిక్సర్ బాది టీమిండియాను గెలిపించాడు.
అంతకుముందు జోష్ ఇంగ్లిస్ (50 బంతుల్లో 110; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) శతక్కొట్టడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టీవ్ స్మిత్ (52) అర్ధసెంచరీతో రాణించాడు. ఇంగ్లిస్ విధ్వంసం ధాటికి భారత బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఓవరాల్‌గా మంచి మ్యాచ్. ఇంగ్లిస్ మాకు మంచి స్కోర్ అందించాడు. డిఫెండ్ చేసుకోగలమని భావించాం. కానీ సూర్యకుమార్ మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. మ్యాచ్ గెలిచేందుకు ఆఖరి ఓవర్లోనూ అవకాశం వచ్చింది. అయితే రింకూ సింగ్ సిక్సర్ బాది ఖేల్ ఖతం చేశాడు. యువ భారత ఆటగాళ్లకు ఐపీఎల్‌తో పాటు స్థానిక దేశవాలీ టీ20లు ఆడటం బాగా కలిసొచ్చింది.
మా వరకు మేము బౌలింగ్ బాగానే చేశాం. అయితే యార్కర్లు సంధించడంలో విఫలమయ్యాం. ఈ గేమ్ నుండి చాలా పాజిటివ్‌లు తీసుకోవాలి. ఇంగ్లిస్ క్లాసీ బ్యాటింగ్. 19వ ఓవర్‌లో ఇల్లిస్ కట్టుదిట్టమైన బౌలింగ్. మొత్తంగా మా వైపు నుంచి అద్బుత ప్రదర్శన చేశాం. కానీ, టీమిండియా ఆటగాళ్లు మా కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చి మాపై పైచేయి సాధించారు. సూర్య విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడినప్పటికీ చివరి బంతి వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లామంటే మా ప్రదర్శన బాగానే ఉన్నట్లు అనుకుంటున్నామని వేడ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment