
ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్ మ్యాచ్.. 43 ఏళ్ల 6 నెలల వయసులో ఒక ‘కుర్రాడు’ టెన్నిస్ కోర్టులో సత్తా చాటుతున్నాడు. అతని ఆట పార్ట్‌నర్‌ను కూడా అబ్బురపరుస్తోంది. చూస్తే మూడు పదులు ఇంకా దాటలేదేమో అనిపిస్తోంది.
చివరకు అద్భుతమైన ఆటతో పార్ట్‌నర్‌తో కలసి అతను ఫైనల్‌కు చేరాడు. తద్వారా అతి పెద్ద వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. అతనే రోహన్ బోపన్న. భారత టెన్నిస్‌కు సంబంధించి తనదైన ముద్ర వేసిన అతను.. పేస్–భూపతి ద్వయం తర్వాత అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికీ సత్తా చాటుతూ డబుల్స్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.
రెండేళ్ల క్రితం వరుస పరాజయాలు బోపన్నను కలవరపరచాయి. ఒక ఏడాదైతే అప్పటికి అతను ఆడిన ఏడు మ్యాచ్‌లలోనూ ఓటమిపాలయ్యాడు. సముద్రం ఒడ్డున నిలబడి అతను ‘నేను అసలు ఎందుకు ఆడుతున్నాను? ఎవరి కోసం ఆడుతున్నాను? కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోతున్నా. ఇంట్లో భార్యా, పసిపాపను వదిలి ప్రపంచమంతా తిరుగుతున్నాను. ఇక ఆటను ఆపేసి తిరిగి వెళ్లిపోతాను’ అంటూ రోదించాడు. కానీ ఆ తర్వాత అతనిలో పట్టుదల పెరిగింది. ఆపై విజయాలు నడిచొచ్చాయి.
గత రెండేళ్లలో అతను తన కెరీర్‌లో అత్యుత్తమ దశను చూశాడు. ఇప్పుడు అదే గుర్తు చేస్తే ‘నేను ఇంకా ఎందుకు ఆడకూడదు? ఈ విజయాలను ఇలాగే కొనసాగిస్తా’ అంటూ సగర్వంగా చెప్పగలగడం అతని మారిన ఆటకు, దృక్పథానికి నిదర్శనం. యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడినా.. 43 ఏళ్ల వయసులో కోర్టులో అతని ఆట, కదలికలు నభూతో అనిపించాయి. 2019లో మోకాలిలో మృదులాస్థి పూర్తిగా కోల్పోయి రోజుకు మూడు పెయిన్ కిల్లర్లపై ఆధారపడిన అతను ఇప్పుడు ఈ రకంగా చెలరేగడం బోపన్న పట్టుదలను, పోరాటాన్ని చూపిస్తోంది.
తండ్రి అండతో ఆటలో అడుగులు..
కర్నాటకలోని కూర్గ్.. అందమైన కాఫీ తోటలకు ప్రసిద్ధి. అక్కడే ఎంజీ బోపన్న, మల్లిక నివాసం. వారి ఇద్దరు పిల్లల్లో రోహన్ ఒకడు. చిన్నతనంలో ఫుట్‌బాల్, హాకీలాంటి ఆటలను ఇష్టపడినా ఏదైనా ఒక వ్యక్తిగత క్రీడాంశంలో తన కొడుకును తీర్చిదిద్దాలనేది అతని తండ్రి కోరిక. సరిగ్గా చెప్పాలంటే ప్రొఫెషనల్ క్రీడాకారుడిని చేయడమే ఆయన ఆలోచన.
దాంతో 11 ఏళ్ల రోహన్‌ను ఆయన టెన్నిస్ వైపు మళ్లించాడు. ఆ అబ్బాయి కూడా అంతే ఉత్సాహంగా ఆటకు సిద్ధమయ్యాడు. స్టార్ ప్లేయర్ మహేశ్ భూపతి తండ్రి సీజీ భూపతి బెంగళూరులో అప్పటికే గుర్తింపు పొందిన కోచ్. తన కుమారుడికి అతడే సరైన శిక్షకుడిగా భావించిన ఎంజీ బోపన్న వెంటనే అక్కడ చేర్పించాడు. ఆటలో ఓనమాలు నేర్చుకొని కొంత మెరుగైన తర్వాత సహజంగానే జూనియర్ స్థాయి పోటీల్లో రోహన్ సత్తా చాటడం మొదలుపెట్టాడు. నాలుగేళ్లు జాతీయ స్థాయిలో విజయాల తర్వాత సీనియర్ దశలోకి అతను ప్రవేశించాడు.
ఆఫ్రో ఏషియన్ క్రీడలతో మొదలు..
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నిర్వహించే వరుస టోర్నీల్లో పాల్గొంటూ తన ఆటకు పదును పెట్టుకున్న రోహన్ 23 ఏళ్ల వయసులో పూర్తి స్థాయి ప్రొఫెషనల్‌గా మారి సర్క్యూట్‌లోకి అడుగు పెట్టాడు. అయితే ఊహించినట్లుగానే చెప్పుకోదగ్గ విజయాలు రాలేదు. చాలా సందర్భాల్లో ఆరంభ రౌండ్లలోనే వెనుదిరగడం రొటీన్‌గా మారిపోయింది.
సింగిల్స్‌లో ఫలితాలు ఇలా రావడంతో మరో వైపు డబుల్స్‌పై కూడా బోపన్న దృష్టి పెట్టాడు. 2003లో హైదరాబాద్‌లో జరిగిన ఆఫ్రో ఏషియన్ క్రీడల్లో తన గురువు కొడుకు, తాను అభిమానించే మహేశ్ భూపతితో కలసి అతను డబుల్స్ బరిలోకి దిగాడు. సింగిల్స్, డబుల్స్ విభాగాలు రెండింటిలోనూ స్వర్ణాలు గెలవడంతో అతనికి భారత టెన్నిస్ వర్గాల్లో తగిన గుర్తింపు లభించింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ ఫ్యూచర్స్ టోర్నీలో ఆడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు.
26 ఏళ్ల వయసు..
సాధారణంగా టెన్నిస్ ప్రపంచంలో ఈ వయసు వచ్చేసరికే చాలా మంది ఆటగాళ్లు తమ సత్తాను ప్రదర్శించి ఒక స్థాయికి చేరుకొని ఉంటారు. ఆ వయసులో మొదటిసారి గ్రాండ్‌స్లామ్ ఆడటం అంటే బాగా ఆలస్యమైనట్లే. కానీ బోపన్న కెరీర్‌కి సంబంధించి అదే కీలక మలుపు. 2006 గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ విభాగంలో తొలిసారి రోహన్ బరిలోకి దిగాడు. క్వాలిఫయింగ్‌లో ఒక మ్యాచ్ గెలిచి మెయిన్ డ్రా వరకు చేరలేకపోయినా.. ఈ మేజర్ టోర్నీ అనుభవం అతనికి ఎంతో మేలు చేసింది.
భారత డేవిస్ కప్ జట్టులో సభ్యుడిగా కూడా ఆడి దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న తన తండ్రి కోరికనూ నెరవేర్చడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని రోహన్ ఒకసారి చెప్పుకున్నాడు. సింగిల్స్‌లో అప్పుడప్పుడూ మంచి ఫలితాలే వస్తున్నా పెద్ద విజయాలు లేకపోవడం రోహన్‌ను అసంతృప్తికి గురి చేస్తూ వచ్చింది.
మరో వైపు తీవ్రమైన భుజం గాయంతో అతను కొంతకాలం బాధపడ్డాడు. కోలుకున్న తర్వాత అతను తీసుకున్న ఒక నిర్ణయం అతని కెరీర్‌ను ఇంత సుదీర్ఘంగా నిలబెట్టింది. 17 ఏళ్లుగా సర్క్యూట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది. సింగిల్స్‌ను వదిలి డబుల్స్‌పై పూర్తిగా దృష్టి పెట్టేలా చేసింది.
చదవండి: WC 2023: ఒకప్పుడు పసికూన.. ఇప్పుడు వరల్డ్‌క్లాస్ జట్లకు కూడా దడ పుట్టించగలదు
Comments
Please login to add a commentAdd a comment