
భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. మరో కొన్ని గంటల్లో ఈ మెగా ఫైనల్ ప్రారంభం కానుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రంపంచ చాంపియన్స్‌గా నిలవాలని రోహిత్ సేన భావిస్తోంది.
ఈ క్రమంలో పటిష్ట ఆసీస్‌ను ఢీకొట్టేందుకు భారత్ కూడా బలమైన జట్టుతో బరిలోకి దిగాలని యోచిస్తోంది. అయితే ఓవల్ మైదానంలో పరిస్థితులు, వాతావరణాన్ని బట్టి చూస్తే తుది జట్టు ఎంపిక విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్‌లో సందిగ్ధత కొనసాగుతోంది.
కేఎస్ భరత్‌కు అవకాశం దక్కేనా!
ఆడిన ఆఖరి టెస్టులో (ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు) తుది జట్టును చూస్తే ఒకటి, రెండు స్థానాలు మినహా ఇతర ఆటగాళ్లందరికీ చోటు ఖాయం. టాప్–4లో రోహిత్, గిల్, పుజారా, కోహ్లి ఉండగా, శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో ఐదో స్థానంలో రహానే ఆడతాడు. ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు చోటు ఖాయం.
అయితే ఓవల్ మైదానాన్ని బట్టి చూస్తే భారత్ నలుగురు పేసర్లతో ఆడుతుందా లేదా రెండో స్పిన్నర్‌కు అవకాశం దక్కుతుందా చూడాలి. మ్యాచ్‌కు ముందు రోజు రోహిత్ కూడా సీనియర్ బౌలర్ అశ్విన్ స్థానంపై హామీ ఇవ్వలేకపోయాడు. షమీ, సిరాజ్‌లతో పాటు ఉమేశ్ యాదవ్, జైదేవ్ ఉనాద్కట్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. రెండో స్పిన్నర్ అవసరం లేదనుకుంటే శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం ఉంది. అయితే ప్రధానంగా వికెట్ కీపర్‌పైనే చర్చ కొనసాగుతోంది.
కీపింగ్ నైపుణ్యాన్ని బట్టి చూస్తే ఆంధ్ర వికెట్ కీపర్ కోన శ్రీకర్ (కేఎస్) భరత్‌ను ఎంచుకోవాలి. అయితే దూకుడైన బ్యాటింగ్‌తో పాటు ఎడంచేతి వాటం కావడం ఇషాన్ కిషన్ అవకాశాలు పెంచుతోంది. అయితే ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఆడని ఇషాన్‌ను కీలకపోరులో అరంగేట్రం చేయిస్తారా అనేది సందేహమే. ఐపీఎల్ కారణంగా భారత ఆటగాళ్లంతా టి20ల్లోనే ఆడినా, ఆటతో ‘టచ్’లోనే ఉన్నారు. కీలక ఆటగాడు పుజారా ఇటీవలి కౌంటీ క్రికెట్ అనుభవం జట్టుకు ఉపయోగపడనుంది.
చదవండి: WTC Final: సచిన్, ద్రవిడ్ రికార్డులకు ఎసరు పెట్టిన కోహ్లి