జడేజాకు కష్టమే.. త్యాగాల గోల తప్పదు; అభిమానుల ఆగ్రహం | Sanjay Manjrekar Feel Axar Patel Picked-over Jadeja ICC T20 WC 2022 | Sakshi
Sakshi News home page

T20 WC 2022: జడేజాకు కష్టమే.. త్యాగాల గోల తప్పదు; అభిమానుల ఆగ్రహం

Published Sat, Jun 25 2022 8:06 PM | Last Updated on Sat, Jun 25 2022 9:00 PM

Sanjay Manjrekar Feel Axar Patel Picked-over Jadeja ICC T20 WC 2022 - Sakshi

టి20 ప్రపంచకప్‌ 2022కు మరో నాలుగు నెలల సమయం ఉంది. అయితే అప్పటివరకు పటిష్టమైన జట్టును రూపొందించాలంటే ఈ గ్యాప్‌లో టీమిండియా ఆడనున్న సిరీస్‌లు కీలకమనే చెప్పొచ్చు. సౌతాఫ్రికాతో సిరీస్‌తో ఇప్పటికే టి20 ప్రపంచకప్‌ సన్నాహకాలు మొదలైనట్లేనని చెప్పొచ్చు. ఆ సిరీస్‌లో ఇషాన్‌ కిషన్‌, దినేశ్‌ కార్తిక్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు సూపర్‌గా రాణించి పొట్టి ప్రపంచకప్‌కు తమనే ఎంపిక చేయాల్సిందేనంటూ పరోక్షంగా సంకేతాలు పంపారు. తాజాగా ఏకకాలంలో అటు ఐర్లాండ్‌.. ఇటు ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా బిజీ కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర​ సంజయ్‌ మంజ్రేకర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రానున్న టి20 ప్రపంచకప్‌ కోసం జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. '' ఒక విషయం క్లియర్‌ అయింది. కార్తిక్‌ 6 లేదా ఏడో స్థానంలో వచ్చి ఫినిషర్‌గా అదరగొట్టడం గ్యారంటీ. అయితే ఇదే జడేజాను చిక్కుల్లో పడేలా చేసింది. టాప్‌ నాలుగు స్థానాలు ఇప్పటికే ఖరారయిన నేపథ్యంలో ఐదు, ఆరు, ఏడు స్థానాలు కీలకంగా మారాయి. దినేశ్‌ కార్తిక్‌ కంటే ముందు హార్దిక్‌ పాండ్యా బ్యాటింగ్‌కు వస్తున్నాడు. మధ్యలో రిషబ్‌ పంత్‌ కూడా ఉన్నాడు.

ఈ ముగ్గురికి తుది జట్టులో చోటు ఉంటే జడేజా ఉండడం కష్టమవుతుంది. అందుకే జడేజా స్థానంలో అక్షర్‌ పటేల్‌ను తీసుకోవడం ఉత్తమం. అయితే జడేజా స్థానాన్ని నేను తప్పుబట్టడం లేదు. అతను ఎంత మంచి ఆల్‌రౌండర్‌ అనేది అందరికి తెలిసిందే. కానీ టి20 ప్రపం‍చకప్‌లో పర్‌ఫెక్ట్‌ జట్టును ఎంపిక చేయాలంటే ఈ త్యాగాల గోల తప్పేలా లేదు'' అంటూ కామెంట్‌ చేశాడు. అయితే మంజ్రేకర్‌ జడేజాను పక్కనబెట్టాలని చేసిన ప్రతిపాదనను అభిమానులు తిరస్కరించారు. ఈ తరం ఆల్‌రౌండర్లలో గొప్ప పేరు పొందిన జడేజాను పక్కడబెడితే టీమిండియా తగిన మూల్యం చెల్లించుకున్నట్లే అని కామెంట్స్‌ చేశారు.

ఇక జడేజా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో నాయకత్వ బాధ్యతలు అందుకున్న జాడేజా జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. దీంతో కెప్టెన్సీ నుంచి మధ్యలోనే వైదొలిగిన జడ్డూ తిరిగి ధోనికి బాధ్యతలు అప్పజెప్పాడు. సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ 116 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు తీసి నిరాశపరిచాడు. ఆ తర్వాత గాయం కారణంగా ఐపీఎల్‌ నుంచి వైదొలిగిన జడేజా ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌ సాధించి ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాడు. 

చదవండి: కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement