ICC ODI WC 2023: పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. భారీ అంచనాలతో వన్డే వరల్డ్‌కప్-2023 బరిలోకి దిగిన అతడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడని విమర్శించాడు. రవూఫ్ బౌలింగ్ అంటే చాలు బ్యాటర్లు పండుగ చేసుకుంటున్నారని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మరీ చెత్తగా బౌలింగ్ చేశాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా పాకిస్తాన్- ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్(163), మిచెల్ మార్ష్(121) విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు పాక్ బౌలర్ల పప్పులు ఉడకలేదు. వీరిద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగి పరుగుల వరద పారించారు.
ఇక ఈ మ్యాచ్‌లో పాక్ ఫాస్ట్‌బౌలర్ హ్యారిస్ రవూఫ్ 8 ఓవర్ల బౌలింగ్‌లో ఏకంగా 83 పరుగులు సమర్పించుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసినప్పటికీ వార్నర్- మార్ష్ ద్వయం కారణంగా అప్పటికే ఆసీస్ భారీ స్కోరు దిశగా పయనించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగులు చేసింది.
వికెట్లు తీసి ఏం లాభం?
ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో పాక్ 305 పరుగులకే కుప్పకూలడంతో 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘షాహిన్ ఆఫ్రిది 5 వికెట్లు తీయడంతో పాకిస్తాన్ తిరిగి పుంజుకోగలిగింది. హ్యారిస్ రవూఫ్ కూడా ఆఖర్లో వికెట్లు తీశాడు.
బ్యాటర్లు అతడి వెంట పడి తరుముతున్నారు
కానీ ఏం లాభం! ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ట్యాప్ విరిగి నీళ్లు పారినట్లుగా ఆసీస్ బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో పరుగుల వరద పారించారు. రవూఫ్ బౌలింగ్‌లో చితక్కొట్టారు. ఇప్పటికే ఈ టోర్నీలో చాలా మంది బ్యాటరుల రవూఫ్ బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు.
టెర్రర్ బౌలర్‌గా టోర్నమెంట్లో అడుగుపెట్టిర రవూఫ్ ఆ స్థాయికి తగ్గట్లు ప్రభావం చూపలేకపోతున్నాడు. బ్యాటర్లు అతడి వెంట పరిగెడుతూ పరుగులు సాధిస్తున్నట్లుగా అనిపిస్తోంది’’ అంటూ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌ను విమర్శించాడు. అయితే, తనదైన రోజు అతడు కచ్చితంగా ప్రభావం చూపుతాడని ఆకాశ్ చోప్రా పేర్కొనడం కొసమెరుపు.
చదవండి: కోహ్లి సెంచరీ చేసిన తీరును తప్పుబట్టిన పుజారా! త్యాగం చేయాల్సింది..
Comments
Please login to add a commentAdd a comment