టీమిండియా జెర్సీలో షఫాలీ- తనుశ్రీ సర్కార్
బీసీసీఐ దేశవాళీ సీనియర్ మహిళల వన్డే టోర్నీ(Senior Women’s One-Day)లో సోమవారం నాటి మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. తద్వారా లక్ష్య ఛేదనలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. హరియాణా, బెంగాల్ జట్ల మధ్య జరిగిన పోరులో ఈ ఘనత చోటు చేసుకుంది.
కాగా సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బెంగాల్ 5 వికెట్లతో హరియాణాపై నెగ్గింది. ముందుగాబ్యాటింగ్ చేసిన హరియాణా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది.
షఫాలీ ఊచకోత
హరియాణా బ్యాటర్లలో కెప్టెన్ షఫాలీ వర్మ (115 బంతుల్లో 197; 22 ఫోర్లు, 11 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించింది. షఫాలీకి సోనియా (61; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), రీమా (58; 8 ఫోర్లు), త్రివేణి (46; 5 ఫోర్లు) అండగా నిలిచారు.
తనుశ్రీ సర్కార్ ధనాధన్ సెంచరీ
అనంతరం బెంగాల్ 49.1 ఓవర్లలో 5 వికెట్లకు 390 పరుగులు చేసి ఛేదనలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. బెంగాల్ ఓపెనర్లు ధారా గుజ్జార్, సస్తి మొండల్ కేవలం 9.1 ఓవర్లలోనే 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గుజ్జార్ 49 బంతుల్లో 69, మొండల్ 29 బంతుల్లో 52 పరుగులు బాదారు.
ఇక ఆల్‌రౌండర్ తనుశ్రీ సర్కార్(Tanusree Sarkar) ఆకాశమే హద్దుగా చెలరేగి.. 83 బంతుల్లోనే 113 రన్స్ రాబట్టింది. ప్రియాంక బాల 81 బంతుల్లో 88 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది.
కాగా 2019లో కాంటర్‌బరీ టీమ్ 309 పరుగుల లక్ష్యాన్ని విధించగా ... నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ 312 పరుగులు చేసి గెలిచిన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. బెంగాల్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తనుశ్రీ సర్కార్ (83 బంతుల్లో 113; 20 ఫోర్లు) శతకం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment