కోచ్‌తో గొడవ నిజమే!.. బంగ్లాతో సిరీస్‌కు షాహిన్‌ దూరం | Shaheen Afridi May Miss Test Series Vs Bangladesh Due to birth of His First Child | Sakshi
Sakshi News home page

కోచ్‌తో గొడవ నిజమే!.. బంగ్లాతో సిరీస్‌కు షాహిన్‌ దూరం

Published Fri, Jul 12 2024 2:19 PM | Last Updated on Fri, Jul 12 2024 3:48 PM

Shaheen Afridi May Miss Test Series Vs Bangladesh Due to birth of His First Child

పాకిస్తాన్‌ ప్రధాన పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని టెస్టు జట్టు హెడ్‌ కోచ్‌ జేసన్‌ గిల్లెస్పి ధ్రువీకరించాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024కు ముందే పాక్‌ క్రికెట్‌ బోర్డు ఆఫ్రిదిని పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో బాబర్‌ ఆజం తిరిగి సారథిగా నియమితుడయ్యాడు.

అయితే, ఈ ఐసీసీ టోర్నీలో పాకిస్తాన్‌ దారుణంగా విఫలమైంది. కనీసం సూపర్‌-8 చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ సమయంలో బాబర్‌తో పాటు కోచ్‌లతోనూ షాహిన్‌ ఆఫ్రిదికి గొడవలు తలెత్తాయనే వార్తలు వినిపించాయి.

దీంతో పీసీబీ ఆఫ్రిదిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ పాకిస్తాన్‌ మీడియా కథనాలు ప్రచురించింది. బ్యాటింగ్‌ కోచ్‌ మహ్మద్‌ యూసఫ్‌తో షాహిన్‌కు వాదన జరగడం నిజమేనని.. అయితే, ఆటలో ఇవన్నీ సహజమేనని పీసీబీ వర్గాలు పేర్కొన్నట్లు జియో న్యూస్‌ వెల్లడించింది.

తనకు కొత్త పాఠాలు నేర్పవద్దని షాహిన్‌ యూసఫ్‌తో దురుసుగా ప్రవర్తించాడని.. అయితే, ఆ తర్వాత క్షమాపణలు చెప్పినట్లు తెలిపింది. ఈ వివాదం ఇంతటితో సమసిపోయిందని పేర్కొంది.

అయితే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు షాహిన్‌ ఆఫ్రిది దూరం కానున్నాడన్న నేపథ్యంలో పీసీబీ చర్యలు తీసుకుంటోందని అంతా భావించారు. అయితే, కోచ్‌ గిల్లెస్పి ఈ వార్తలను కొట్టిపారేశాడు.

షాహిన్‌ ఆఫ్రిది తండ్రి కాబోతున్నాడని, అందుకే ఆ సమయంలో భార్యకు దగ్గరగా ఉండాలని అతడు కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఈ కారణంగానే అతడు బంగ్లాతో సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.

కాగా పాక్‌ దిగ్గజ ఆటగాడు షాహిద్‌ ఆఫ్రిది కుమార్తె అన్షాను షాహిన్‌ ఆఫ్రిది గతేడాది పెళ్లాడాడు. ఈ జంట త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం పాకిస్తాన్‌కు వెళ్లనుంది. ఆగష్టు 21 నుంచి సెప్టెంబరు 3 వరకు ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement